యాప్‌లో సన్నీలియోన్‌, విజయ్‌

29 Oct, 2018 09:17 IST|Sakshi

అభిమానులతో ‘టచ్‌’లో ఉండే విషయంలో తారలు రోజురోజుకు ముందడుగు వేస్తున్నారు. ఫేస్‌బుక్, ట్వీటర్‌లు దాటి ‘టచ్‌’ చేస్తే చాలు ప్రత్యక్షమయ్యే వరకు వచ్చేశారు. ఇప్పటి వరకు విభిన్న రకాల సేవలు అందించేందుకే పరిమితమైన యాప్స్‌... స్టార్స్‌ని జత చేస్తూ స్మార్ట్‌ ఫోన్‌కి కొత్త సందడినిమోసుకొస్తున్నాయి. ‘యాప్‌’ రూపంలో ప్రత్యక్షమవుతున్న స్టార్స్‌... ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్‌ అందిస్తున్నారు. 

సాక్షి, సిటీబ్యూరో   : హాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టగా, మన బాలీవుడ్‌ స్టార్స్‌ దాన్ని శరవేగంగా అందిపుచ్చుకున్నారు. యాప్స్‌ విడుదల చేయడం ఒకెత్తయితే, వాటికి లభిస్తున్న ఆదరణ ఆధారంగా గూగుల్‌  ఇస్తున్న స్టార్‌ రేటింగ్స్‌ కూడా ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది సినీ ఇండస్ట్రీగా మారాయి. ఈ ట్రెండ్‌ అలాఅలా దక్షిణాది తారల వరకూ వచ్చేసింది. తాజాగా టాలీవుడ్‌ స్టార్స్‌ కూడా యాప్స్‌ని విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు. 

సోనమ్‌.. ఫేమ్‌  
బాలీవుడ్‌ స్టైల్‌ దివాగా పేరొందిన సోనమ్‌కపూర్‌... రెండేళ్ల క్రితమే తన యాప్‌ లాంచ్‌ చేసి, ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన తొలి సెలబ్రిటీగా నిలిచింది. వినియోగదారులు తనతో నేరుగా చాట్‌ చేసే అవకాశం కూడా ఆమె అందిస్తోంది. ఫ్యాషన్, స్టైల్‌ టిప్స్‌తో పాటు సోనమ్‌ ఫిట్‌నెస్, న్యూట్రిషన్‌ రొటీన్‌లను ఇది కళ్లకు కడుతోంది. ఈ యాప్‌కి ప్రస్తుతం గూగుల్‌ ప్లేస్టోర్‌లో 4.6 స్టార్‌ రేటింగ్‌ ఉంది.  

సల్లూభాయ్‌.. హాయ్‌  
ఉత్తరాదితో పాటు నగరంలోనూ విశేషంగా అభిమానులున్న కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌... గతేడాది తన 51వ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు పర్సనల్‌ యాప్‌ ‘బీయింగ్‌ ఇన్‌ టచ్‌’ని గిఫ్ట్‌గా అందించారు. ఈ యాప్‌ ద్వారా ఆయన తనకు సంబంధించిన వివిధ విశేషాల్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఆయన వర్కవుట్‌ రొటీన్‌ నుంచి ఇష్టమైన ఆహారం దాకా... దీని ద్వారా ఫ్యాన్స్‌కు చేరిపోతున్నాయి. అంతేకాదు... ఆయన సేవా వేదిక ‘బీయింగ్‌ హ్యూమన్‌’ ద్వారా అందించే ఉద్యోగావకాశాలు, అలాగే పలు బ్రాండ్స్‌కు సంబంధించి రాయితీలు కూడా అందుతున్నాయి. ప్రస్తుతం దీనికి గూగుల్‌ ప్లేస్టోర్‌లో 4.9 స్టార్‌ రేటింగ్‌ ఉంది.  

అలియా... ఆగయా  
భారతీయ నటీనటుల్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది అలియాభట్‌. ఒక లైవ్‌ స్టిమ్యులేషన్‌ గేమ్‌లో పాత్రగా మారిపోయింది. ఈ గేమ్‌ మార్చి 22న ‘స్టార్‌ లైఫ్‌’ పేరుతో విడుదలైంది. ఇందులో ఆటగాడి ప్రియ నేస్తంగా ఉండి తనకి కావాల్సిన అన్ని రకాల గైడెన్స్‌ ఇస్తుంది అలియా. సినిమా రంగంలో తమ కెరీర్‌ను నిర్మించుకునే వారికి కావాల్సిన రకరకాల సూచనలు అందిస్తుంది. ఆడేవాళ్లు స్త్రీ/పురుష పాత్ర ఎంచుకోవచ్చు. ఈ గేమ్‌లో డ్యాన్సింగ్, డిజైనర్‌ దుస్తులు ధరించడం, టాప్‌ ఫొటోగ్రాఫర్స్‌తో ఫొటో షూట్స్, ఇంటర్వ్యూలు ఇవ్వడం... ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ యాప్‌కి ప్రస్తుతం గూగుల్‌ ప్లేస్టోర్‌లో 4.4 స్టార్‌ రేటింగ్‌ ఉంది.  

కాంటెస్ట్‌ ‘దిశ’గా...
తన పేరు మీద గత మార్చి 22నే అధికారిక యాప్‌ లాంచ్‌ చేసింది దిశా పఠాని. తన అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉండడం మాత్రమే కాకుండా దీని ద్వారా కాంటెస్ట్‌లు సైతం నిర్వహిస్తోందామె. లైవ్‌ బ్రాడ్‌కాస్ట్సŠ, ఈవెంట్‌ టికెట్స్‌... ఇంకా ఎన్నో ఈ యాప్‌ ద్వారా అందిస్తోంది. దీనికి గూగుల్‌ ప్లేస్టోర్‌లో 4.8 స్టార్‌ రేటింగ్‌ ఉంది.  

‘బ్లూ’టీఫుల్‌...
నిన్నటి బ్లూ స్టార్, నేటి బాలీవుడ్‌ స్టార్‌ సన్నీలియోన్‌ సైతం ఈ విషయంలో వెనుకంజలో లేదు. తనతో మాట్లాడాలనుకునే అభిమానులకు మాత్రమే కాదు... నేరుగా కలవాలనుకునే వారికి కూడా ఈ యాప్‌ ద్వారా అవకాశం ఇస్తోంది. వినియోగదారుల కోసం పోటీలు నిర్వహిస్తూ ఈవెంట్‌ టికెట్స్‌ వంటి బహుమతులు అందిస్తూ... అదే క్రమంలో తనను కలిసే వారికి గిఫ్ట్‌ను కూడా ఇస్తున్నారామె. ఈ యాప్‌కి 4.6 స్టార్‌ రేటింగ్‌ ఉంది.  

కాజల్‌.. శ్రద్ధ.. విజయ్‌ 
టాలీవుడ్‌ టాప్‌స్టార్‌ కాజల్‌ అగర్వాల్‌ ఈ విషయంలో తాను కూడా యాప్ట్‌ అనిపించుకున్నారు. తన వాల్‌పేపర్స్, వీడియోలు, రింగ్‌ టోన్స్‌... వగైరాలను అందిస్తూ ఆమె ఫ్యాన్స్‌కు ఆసక్తి పెంచుతున్నారు. ఈ యాప్‌కి ప్రస్తుతం 4.9 స్టార్‌ రేటింగ్‌ ఉంది. టాలీవుడ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ కూడా ఇటీవలే ‘రౌడీ’ యాప్‌ లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ యాప్‌ ద్వారా ఆయన వారానికి ఒక ఫ్యాషన్‌ స్టైల్‌ని అభిమానుల కోసం లాంచ్‌ చేస్తూ వాటిని విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాప్‌కి కూడా మంచి స్పందన లభిస్తోంది. బాలీవుడ్‌–టాలీవుడ్‌ నటి శ్రద్ధాదాస్‌ కూడా ఒక యాప్‌ని విడుదల చేసింది. అభిమానులతో మరింత సన్నిహితం కావడానికి, తన సినిమాలు, ఈవెంట్స్, షోస్‌ గురించి వారికి సమాచారం అప్‌ టు డేట్‌గా అందించడానికి ఈ యాప్‌ ఉపకరిస్తుందని శ్రద్ధా అంటోంది. తనకు సంబంధించిన అన్ని వార్తలూ తొలుత యాప్‌లోనే ప్రత్యక్షమవుతాయని ఆమె చెబుతోంది.  

మాస్టర్‌.. ‘యాప్‌’ స్టార్‌
ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ ఆటకు దూరమైనా అభిమానులకు దగ్గరగా ఉండేందుకు తాను సైతం అంటూ యాప్‌ బాట పట్టాడు. సెంచరీలతో దుమ్ము రేపే సచిన్‌ తన యాప్‌కి 110ఎంబీ అంటూ పేరు పెట్టడం యాప్ట్‌ టైటిల్‌ కదూ. ఈ యాప్‌ ద్వారా తరచూ తన ఫ్యాన్స్‌ను విభిన్న రకాల విశేషాలతో సచిన్‌ పలకరిస్తుంటాడు.   

నలభీముడి ఘుమఘుమలతో...
ఇండియన్‌ చెఫ్స్‌లో అగ్రగామిగా పేరున్న సంజీవ్‌కపూర్‌ని అభిమానించే వారికీ కొదవలేదు. వెరైటీ వంటకాల గురించి ఆయన చెప్పే కబుర్లతో మమేకమవ్వాలని కోరుకునే అభిమానుల సంఖ్య భారీగానే ఉంటుంది. తన ఫుడీ ఫ్యాన్స్‌ కోసం ఆయన యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్త క్యుజిన్‌ల గురించిన సమాచారాన్ని, విభిన్న రకాల వంటల పోటీల విశేషాలను అందిస్తున్నాడు.  

మరిన్ని వార్తలు