‘అనసూయ రూ. 55 లక్షలు కట్టాలి’

23 Dec, 2019 17:56 IST|Sakshi

హైదరాబాద్‌: టీవీ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ సర్వీసు ట్యాక్స్‌ బకాయి రూ. 55 లక్షలు చెల్లించాల్సి ఉందని జీఎస్టీ అధికారులు తెలిపారు. అనసూయ మొత్తం రూ. 80 లక్షల సేవ పన్ను చెల్లించాల్సి ఉండగా ఆమె కేవలం రూ. 25 లక్షలు మాత్రమే చెల్లించారన్నారు. జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్ జనరల్‌, అదనపు డైరెక్టర్ జనరల్ బాలాజీ మజుందార్ తెలిపిన వివరాల ప్రకారం.. అనసూయ గతంలో రూ. 35 లక్షలు సర్వీసు టాక్స్‌ చెల్లించాల్సి ఉంది. అయితే సరైన సమయంలో చెల్లించని కారణంగా దీనికి వడ్డీ రూ. 15 లక్షలు జత కలిసింది. పెనాల్టీతో కలిపి మొత్తం పన్ను రూ. 80 లక్షల పన్ను చెల్లించాల్సి ఉండగా ఆమె కేవలం రూ. 25 లక్షలు మాత్రమే చెల్లించారని ఆయన పేర్కొన్నారు. మిగతా బకాయి ఇప్పటివరకు చెల్లించలేదని, ఈ మేరకు అనసూయకు నోటీసులు కూడా పంపినట్లు ఆయన వెల్లడించారు.

అయితే దీనిపై అనసూయ స్పందిస్తూ... ‘సర్వీసు పన్ను చెల్లించాలని ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ అధికారులు అడిగారు. జీఎస్టీ అమల్లోకి రాకముందు అంటే 2013- 2014కు చెందిన పన్నులన్నీ చెల్లించాను. జీఎస్టీ చట్టంపై అవగాహన లేని కారణంగా సంబంధిత పన్ను చెల్లించలేకపోయాను. నిర్ణీత సమయంలో ప్రిన్సిపల్‌ అమౌంట్‌ చెల్లించాను కనుక జరిమానా, వడ్డీ పడదని అనుకున్నాను. మే నెలలో మా ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించిన మాట వాస్తవమే. నా వృత్తికి సంబంధించిన కాంట్రాక్టు కాగితాలను తీసుకున్నారు తప్పా, వారికి ఎటువంటి నగదు లభించలేదు. అధికారులు నాకు నోటీసులు ఇవ్వలేద’ని ఆమె స్పష్టం చేశారు. (జీఎస్టీ సోదాలు.. స్పందించిన సుమ, అనసూయ)

>
మరిన్ని వార్తలు