మరోసారి పోలీస్ గెటప్లో

24 Oct, 2015 13:36 IST|Sakshi
మరోసారి పోలీస్ గెటప్లో

'గోపాల గోపాల' లాంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత తదుపరి సినిమాపై విక్టరీ వెంకటేష్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. యంగ్ హీరోలు హవా చూపిస్తుండటంతో ఎలాంటి కథ ఎంచుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో వరుసగా కథలు వింటూ కాలం గడిపేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ఈ గ్యాప్లో మారుతి, క్రాంతి మాధవ్ లాంటి దర్శకులకు వెంకీ ఓకె చెప్పాడన్న టాక్ వినిపించినా, ఆ సినిమాలేవి సెట్స్ మీదకు రాలేదు.

తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. తెలుగులో మోస్ట్ సక్సెస్ఫుల్ కథా రచయితగా గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ, వెంకటేష్ కోసం ఓ యాక్షన్ స్టోరీని రెడీ చేశాడట. ఇప్పటికే ఈ కథను వెంకీకి వినిపించిన వంశీ  అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని వక్కంతం వంశీ స్వయంగా ప్రకటించాడు. ఈ కథలో వెంకటేష్ను మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించనున్నాడు.

అయితే ఈ  ప్రాజెక్ట్ను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మారుతి, క్రాంతి మాధవ్లు సొంత కథలతో వెంకటేష్ డేట్స్ కోసం ఎదురుచూస్తుండగా, వక్కంతం వంశీ ఇచ్చిన కథను గోపాల గోపాల ఫేం కిశోర్ కుమార్ పార్థసాని డైరెక్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఈ మూడు ప్రాజెక్ట్స్ లో వెంకీ, ఏ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళతాడో చూడాలి.