నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

4 Sep, 2019 00:42 IST|Sakshi

‘‘శ్రీనివాస్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు. ఒకప్పుడు నేను మద్రాసులో ఉండలేననుకుని, సినిమా పరిశ్రమ నుంచి వెళ్లిపోదాం అనుకున్నాను. అప్పుడు ‘నువ్విక్కడ ఉండి చాలా సాధించగలవు’ అంటూ నాలో నమ్మకాన్ని నింపాడు శ్రీనివాస్‌రెడ్డి. నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్‌. శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీనవ్‌హాస్‌ క్రియేషన్స్, శ్రీకార్తికేయ సెల్యూలాయిడ్స్‌ నిర్మించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ఇషా రెబ్బా, సత్యదేవ్‌ జంటగా శ్రీనివాస్‌ కానూరి నిర్మించారు. 

ఈ చిత్రం టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను వినాయక్‌ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘టైటిల్‌ వినగానే రేడియోలో వచ్చే వాయిస్‌ గుర్తొచ్చింది. శ్రీనివాస్‌రెడ్డి మంచి దర్శకుడు. మంచి స్క్రిప్ట్‌ దొరికితే ఎంత బాగా సినిమా తీస్తాడో చెప్పడానికి ‘ఢమరుకం’ ఓ ఉదాహరణ. ఇప్పుడు ఈ ‘రాగల 24 గంటల్లో’ పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘అదిరిందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘బొమ్మన బ్రదర్స్‌ చందన సిస్టర్స్‌’... ఇలా నా ప్రతి చిత్రం  ఫస్ట్‌లుక్‌ కానీ, ఆడియో గానీ వినాయక్‌గారి చేతుల మీదగా విడుదల చేయించడం నాకు ఆనవాయితీ. మా నిర్మాత శ్రీనివాస్‌గారి సహకారం వల్ల మంచి అవుట్‌పుట్‌ వచ్చింది’’ అన్నారు శ్రీనివాస్‌రెడ్డి. ‘‘ఇది నా మొదటి చిత్రం. ప్రేక్షకులందరూ మంచి సినిమా తీశావని అభినందిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీనివాస్‌ కానూరి. ఈ చిత్రానికి కెమెరా: అంజి, ఎడిటింగ్‌: తమ్మిరాజు, మాటలు: కృష్ణభగవాన్, సంగీతం: రఘు కుంచె, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అలీ బాబా.

>
మరిన్ని వార్తలు