25 రోజుల్లో 376 అంత్యక్రియలు!

30 May, 2020 17:15 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నగరంలో సున్నీ ముస్లింలకు చెందిన గంజ్‌ షాహిద్‌ ఖబ్రస్థాన్‌ (శ్మశానానికి)కు శవాల తాకిడి ఎక్కువైంది. అందులో ప్రతి రోజు ఎవరివో ఒకరివి అంత్యక్రియలు జరగుతున్నాయి. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 199 మంది సున్నీల మృతదేహాలకు అంత్యక్రియలు జరగ్గా, ఆ సంఖ్య మే నెలలో దాదాపు రెండింతలయింది. గతేడాది, అంటే 2019, ఏప్రిల్‌ నెలలో ఆ శ్మశానంలో కేవలం 66 మంది మృతదేహాలకు మాత్రమే అంత్యక్రియలు జరిగాయి. ఇక మే నెలలో, మొదటి 25 రోజుల్లో 376 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. గతేడాది ఇదే కాలానికి 61 మృతదేహాలకు మాత్రమే అంత్యక్రియలు జరిగాయని శ్వాశాన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

ప్రాణాంతక కరోనా వైరస్‌ కబళించడం వల్లనే శ్మశానంలో అంత్యక్రియల సంఖ్య అంతగా పెరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్‌కు గుజరాత్‌ రాష్ట్రంలో ‘హాట్‌స్పాట్‌’.గా ఉన్న అహ్మదాబాద్‌ నగరంలో ఇప్పటి వరకు 11,163 కరోనా కేసులు నిర్ధారణకాగా, వారిలో 773 మంది మరణించారు. మరణాల సంఖ్య ఏకంగా 6.9 శాతం ఉండడం ఆందోళనకరం. నగరంలోని ముస్లింల శ్మశానాల నిర్వహించే సున్నీ వక్ఫ్‌ బోర్డు అధిపతి రిజ్వాన్‌ ఖాద్రిని ఇదే విషయమై సంప్రతించగా, ఏప్రిల్‌ నెల నుంచి మే 25వ తేదీ వరకు 575 మంది సున్నీలు మరణించగా, వారిలో 147 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని చెప్పారు.

నగరంలోని తమ సున్నీ ముస్లింలకు చెందిన అన్ని శ్మశానాల్లో అంత్యక్రియల సంఖ్య ఈ సారి చాలా ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. ముసా సుహాగ్‌ ఖబ్రస్థాన్‌లో గతేడాది ఏప్రిల్‌లో 71, మే నెలలో 66 అంత్యక్రియలు జరగ్గా , ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో 142, మే నెల మొదటి 27 రోజుల్లో 300 అంత్యక్రియలు జరగ్గా వాటిలో కేవలం 21 మరణాలు మాత్రమే కరోనా కారణంగా మరణించినట్లు ఖాద్రి తెలిపారు. అలాగే చార్టోడ ఖబ్రస్థాన్‌లో గతేడాది ఏప్రిల్‌ నెలలో 55, ఈ ఏడాది ఏప్రిల్‌ 117 అంత్యక్రియలు, అలాగే గతేడాది మే నెలలో 52, ఈ మే నెల మొదటి 15 రోజుల్లోనే 193 మంది మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి.

ఒక్క ముస్లింలకు చెందిన శ్మశానంలోనే కాకుండా ఇతర శ్మశానాల్లో కూడా అంత్యక్రియల సంఖ్య బాగా పెరిగాయి. నగరంలోని ‘అంతిమ్‌ ధామ్‌’ శ్మశానంలో గతేడాది మే నెలలో 180 అంత్యక్రియలు జరగ్గా, ఈ ఏడాది మే నెలలో 350 అంత్యక్రియలు జరిగాయి. ఈ స్థాయిలో అంత్యక్రియలు పెరగడానికి కారణం కరోనా మహమ్మారి కారణమని తెలుస్తోంది. అయితే నిర్ధారిత కేసులు మాత్రం తక్కువగా ఉన్నాయి. అంటే కరోనా కేసులు బయట పడకుండానే పాడె కడుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. (కరోనా వైద్య పరీక్షల్లో తేలిందేమిటి?)

మరిన్ని వార్తలు