ఎమ్మెల్యేతో పాటు కుటుంబమంతా పాజిటివ్‌

22 Jun, 2020 19:22 IST|Sakshi

జైపూర్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌ ధాటికి సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఇ‍ప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. తాజాగా రాజస్తాన్‌లో ఓ ఎమ్యెలేకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. అదికాస్తా ఆయన కుటుంబంలోని మొత్తం 18 మందికి సోకింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని బారీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిరాజ్‌ సింగ్‌ మలింగకు గత వారం కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులను సైతం స్వీయ నిర్బంధలో ఉండాలని సూచించారు. (కోవిడ్‌ కట్టడికి కర్ణాటక కీలక నిర్ణయం)

అనంతరం వారికి నిర్వహించిన పరీక్షల్లో ఎమ్మెల్యే కుటుంబంలోని 18 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అ‍య్యింది. దీంతో వారందరినీ ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులతో సమీపంగా మెలిగిన వారిని గుర్తించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,930 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు వైరస్‌ బారినపడి 349 మంది మృత్యువాత పడ్డారు. ఇక వైరస్‌ బారినపడిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ సైతం చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆయనకు ప్లాస్మా థెరపీ చికిత్స సైతం అందించారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. (మాజీ ఎంపీ వీహెచ్‌కు కరోనా పాజిటివ్‌)

మరిన్ని వార్తలు