పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

20 Feb, 2015 01:19 IST|Sakshi

 న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారతీయ సంతతి ప్రజలు(పీఐఓ), విదేశాల్లోని భారతీయ పౌరులు(ఓసీఐ).. ఈ రెండు విభాగాలను విలీనం చేసేందుకు ఉద్దేశించిన పౌరసత్వ చట్టం(సవరణ) బిల్లును.. జనవరి 6న కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సు స్థానంలో సభలో ప్రవేశపెట్టనున్నారు. 2022 సంవత్సరంలోగా అందరికీ ఇళ్లు లక్ష్యంతో రూపొందించిన జాతీయ పట్టణ గృహనిర్మాణ పథకంపై చర్చను కేబినెట్ ప్రస్తుతానికి వాయిదా వేసింది. అలాగే, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్బంగా రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి చేసే ప్రసంగ పాఠాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ నినాదం స్ఫూర్తి ప్రతిబింబించేలా.. ఎన్డీయే ప్రభుత్వ పథకాలను, విధానాలను వివరిస్తూ సోమవారం(ఫిబ్రవరి 23న) రాష్ట్రపతి ప్రసంగం సాగేలా కేబినెట్ భేటీలో తుది మెరుగులు దిద్దారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్లులను, సభ ఆమోదం పొందాల్సి ఉన్న ఆర్డినెన్సులను కూడా రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు.
 

మరిన్ని వార్తలు