అసెంబ్లీ సీట్లు పెంచాలని కోరా

13 Jan, 2018 01:52 IST|Sakshi
ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన సీఎం చంద్రబాబు

ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇంకా ఇవ్వలేదు  

  సీఎం చంద్రబాబు వెల్లడి 

 నరేంద్ర మోదీతో సీఎం భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చాలని, ఇటీవల ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని త్వరగా అమలు చేయాలని కోరినట్టు చెప్పారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో ప్రధానితో సమావేశమయ్యారు. అనంతరం ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించాలని కోరాను. రాష్ట్ర సర్వీస్‌ సెక్టార్, తలసరి ఆదాయంలో, పారిశ్రా మికంగానూ వెనుకబడి ఉంది.

నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉంది.ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. ఇంకా ఇవ్వలేదు. కేంద్ర ప్రాయోజిత పథకాల రూపంలో 90:10 నిష్పత్తిలో ఐదేళ్లలో రూ.16,447 కోట్లు రావాలి. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాను.  కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటులపై తక్షణమే ప్రకటన చేయాలని కోరాను. రాజధాని నిర్మాణానికి ఇప్పటిదాకా రూ.2,500 కోట్లు ఇచ్చారు. ఇంకో రూ.1,000 కోట్లు ఇస్తామన్నారు. ఇందులో ఇంకా రెండు ఇవ్వాల్సి ఉంది. షెడ్యూల్‌ 13లో కడప స్టీల్‌ప్లాంటు, ఇండస్ట్రియల్‌ కారిడార్, మెట్రో రైలు తదితర విషయాలు ఉన్నాయి. వాటిని స్థాపించాలని విజ్ఞప్తి చేశాను. వీటన్నింటి పరిష్కారం కోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలన్నాను. వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మాట ఇచ్చారు.’’ అని చంద్రబాబు వివరించారు. 

2018కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్న  నమ్మకం ఉందా అని ప్రశ్నించగా ‘’2018 కల్లా పూర్తవుతుందని చెప్పలేను. ఎందుకంటే మూడు నెలలు పోయింది. మేం అనుకున్న ప్రకారం వెళ్లి ఉంటే 2018 కల్లా కాఫర్‌ డ్యామ్‌ పూర్తయ్యేది. గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చి ఉండేవాళ్లం. కానీ, ఇప్పుడు ఇవ్వడం అనుమానమే. 2019 నాటికల్లా ప్రాజెక్టును పూర్తికావాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నుంచి నిర్మాణాత్మకమైన హామీ ఏదైనా వచ్చిందా? అని అడగ్గా... ‘‘పరిష్కారం చూపుతామని చెప్పారు. ఏదైనా నమ్మకం, ఆశతోనే కదా ప్రపంచం ముందుకు వెళ్లగలిగేది’’ అని చంద్రబాబు బదులిచ్చారు. బీజేపీతో పొత్తు విషయంలో చెడిందని వార్తలు వస్తున్నాయి, దీనిపై ఏదైనా చర్చకు వచ్చిందా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘‘పొత్తుకు ఈ రోజు ఉన్న సమస్య ఏంటి? ప్రతిరోజు దాని గురించి ఎందుకు ప్రశ్నిస్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను అనుదినం ప్రయత్నిస్తూనే ఉంటాను. నేను ఎప్పుడు వారితో విడిపోవాలన్నదే మీ ఎజెండా’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు