పతంజలి కరోనా మందుకు బ్రేక్!

23 Jun, 2020 19:22 IST|Sakshi

 పూర్తి వివరాలు సమర్పించండి : ఆయుష్ మంత్రిత్వ శాఖ 

అప్పటివరకూ ప్రచారాన్ని ఆపండి

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నివారణకు ఆయుర్వేద మందును లాంచ్ చేసిన యోగా గురు రాందేవ్ నేతృత్వంలోని పతంజలి సంస్థకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. ఆయుర్వేద ఔషధం కరోనిల్ ప్రారంభానికి ముందు నిర్వహించిన పరిశోధనల పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ  పతంజలి సంస్థను ఆదేశించింది.  అంతేకాదు అప్పటివరకూ ఎలాంటి ప్రచారాన్ని చేపట్టవద్దని  కూడా  మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. పతంజలి చెబుతున్న అంశాలపై వాస్తవాలు, శాస్త్రీయ అధ్యయన వివరాలు మంత్రిత్వ శాఖకు తెలియదని పేర్కొంది. ('కరోనిల్‌' 80 శాతం సక్సెస్‌ను చూపించింది)

పతంజలి అట్టహాసంగా కరోనిల్ మందును ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ మందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కోవిడ్-19 నివారణకు గాను పతంజలి తయారు చేసిన ఆయుర్వేద మందును ఏ మోతాదులో, ఏయే ఆసుపత్రిలలో పరిశీలించారు, సంబంధిత పరిశోధన ఫలితాల తాజా డేటా, ఇనిస్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ క్లియరెన్స్, సీటీఆర్ఐ రిజిస్ట్రేషన్ వివరాలను తమకు అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. వీటిని సమగ్రంగా పరిశీలించేంతవరకు ప్రచారాన్ని ఆపాలని పతంజలి సంస్థను ఆదేశించింది. దీంతోపాటు కరోనిల్ తయారీకి మంజూరు చేసిన లైసెన్స్ కాపీలు, అనుమతి వివరాలను అందించాలని మంత్రిత్వ శాఖ ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కోరింది. పతంజలి ప్రధాన కార్యాలయం హరిద్వార్‌లో ఉంది, ఇది ఉత్తరాఖండ్ అధికార పరిధిలోకి వస్తుంది.


 
రాజస్థాన్ జైపూర్ నిమ్స్ వైద్యులతో పాటు పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో 150కి పైగా ఔషధ మూలికలతో కరోనిల్ ఔషదాన్ని రూపొందించామని పతంజలి సంస్థ ప్రకటించింది. క్లినికల్ కంట్రోల్ స్టడీ, క్లినికల్ కంట్రోల్ ట్రయల్ చేశాకే తాము కరోనిల్ మందును మార్కెట్లో విడుదల చేశామని రాందేవ్ వెల్లడించారు. తమ మందు వాడిన కరోనా వైరస్ రోగులలో ఎక్కువ మంది 14 రోజుల్లో, దాదాపు 80 శాతం కోలుకున్నారని పతంజలి సహ వ్యవస్థాపకుడు బాలకృష్ణ  ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా భారతదేశంలో 425,000 మందికి పైగా కరోనావైరస్ బారిన పడగా, 14,000 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య తొమ్మిది మిలియన్లను దాటింది. మరణాల సంఖ్య 470,000 పైకి చేరుకుంది.

మరిన్ని వార్తలు