కరోనాపై విజయం.. ఘనస్వాగతం

31 Mar, 2020 09:41 IST|Sakshi

అహ్మదాబాద్‌ : కరోనా మహమ్మారి నుంచి కోలుకుని తిరిగి ఇంటికి వచ్చిన ఓ మహిళ(34)కు అనుకోని సంఘటన ఎదురైంది. కరోనా వ్యాధి నుంచి కోలుకున్నా, చుట్టు పక్కన వారు ఎలా చూస్తారో అనే బెంగతో కారు దిగి భయం భయంగా ఇంటికి వచ్చిన ఆ మహిళకి కరత్వాన ధ్వనులతో అపూర్వ స్వాగతం లభించింది. ఇంటి చుట్టు పక్కన వాళ్లు, సొసైటికి చెందిన వాళ్లు అందరూ వరుసగా నిల్చొని కరోనాపై విజయం సాధించినందుకుగానూ శంఖం ఊదుతూ, చప్పట్లు కొడుతూ, ధరువులతో మహిళకు ఘన స్వాగతం పలికారు.

'20 రోజులుగా ఐసోలేషన్‌లో ఉన్న నాకు, కుటుంబాన్ని కలవడానికి వచ్చే ముందు ఎన్నో ఆలోచనలు మదిలో స్పృశించాయి. ఇంటికి రాగానే నన్ను చూసి అందరూ దూరంగా వెళతారని భావించా. కానీ, కరోనా నుంచి కోలుకుని వచ్చిన నాకు మా కాలనీ వాసులు పలికిన స్వాగతం జీవితంలో మర్చిపోలేనిది. మార్చి తొలివారంలో ఫిన్‌ల్యాండ్‌లోని నార్తర్న్‌లైట్స్‌కి విహారయాత్రకు వెళ్లాను. కరోనా మహమ్మారి ప్రబలుతుందనే సమయంలోనే తిరిగి ఇంటికి వచ్చాను. అప్పటికీ భారత్‌లో కేసులు తక్కువగా నమోదయ్యాయి. అయినా అందరికీ దూరంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాను. కొద్దిగా కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించాను. అనంతరం కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయా. ఈ వ్యాధికి మందుగానీ, వ్యాక్సిన్లుగానీ లేవని తెలిసి నిట్టూర్చాను. అయినా కరోనా చికిత్స సమయంలో ఏరోజు కూడా ఒంటరిగా ఫీలవ్వలేదు. అక్కడ డాక్టర్లు, నర్సులు ఇచ్చిన మనోధైర్యం నా వ్యాధి తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడింది' అని కరోనా నుంచి కోలుకుని వచ్చిన అనంతరం మహిళ తెలిపారు.

మరిన్ని వార్తలు