వైర‌ల్‌: టిక్‌టాక్ చేసిన కరోనా పేషెంట్‌

1 Apr, 2020 20:01 IST|Sakshi

చెన్నై: పిచ్చి ముదిరి పాకాన ప‌డ‌ట‌మంటే ఇదేనేమో కాబోలు. ఓవైపు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ త‌న‌కు సోకింద‌న్న విష‌యాన్ని ప‌క్క‌పెట్టి మ‌రీ టిక్‌టాక్ వీడియో చేసిందో మ‌హిళ‌. ఈ అరుదైన ఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటు చేసుకుంది. అరియ‌లూర్‌కు చెందిన‌ ఓ యువ‌తి షాపింగ్ మాల్‌లో ప‌ని చేస్తుండేది. ఆమెకు టిక్‌టాక్ అంటే పిచ్చి. ఎప్పుడూ ఏదో ఒక వీడియో చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి సంతోషిస్తుండేది. అయితే ఈ మ‌ధ్యే ఆమె జ్వ‌రం, ద‌గ్గు ల‌క్ష‌ణాల‌తో జిల్లా ప్ర‌భుత్వ‌ ఆసుప‌త్రిలో చేరింది. అక్క‌డ ఆమెకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా మార్చి 26న క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న స‌మ‌యంలోనూ ఆమె టిక్‌టాక్‌ను వ‌ద‌ల్లేదు. సోమ‌వారం ఓ బాధాక‌ర‌మైన పాట‌తో త‌న భావోద్వేగాల‌ను తెలుపుతూ ఐసోలేష‌న్ వార్డులోని ముగ్గురు సిబ్బందితో క‌లిసి టిక్‌టాక్ వీడియో చేసింది. (కరోనాను ఇలా జయించండి..)

"నేను తీవ్ర‌మైన గొంతు నొప్పి, జ‌లుబుతో బాధ‌ప‌డుతున్నాను. మాట్లాడాలంటే కూడా చాలా క‌ష్టంగా ఉంది. ఇక్క‌డ నాకు రోజూ ఫ్రూట్స్‌, గుడ్లు ఇస్తున్నారు. కానీ తినడానికి నా గొంతు స‌హ‌క‌రించ‌డం లేదు. మార్చి 30 నుంచి నా ప‌రిస్థితి ఇలాగే ఉంది" అని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. కానీ ఎడ‌తెరిపి లేకుండా వ‌స్తున్న ద‌గ్గు వ‌ల్ల‌ ఆమె 30 సెకండ్ల క‌న్నా ఎక్కువ సేపు మాట్లాడ‌లేక‌పోయింది. అయితే ఈ వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. ఇది అక్క‌డి అధికారుల‌ను ఆగ్ర‌హానికి గురి చేయ‌గా ఆమెకు స‌హ‌క‌రించిన ముగ్గురు సిబ్బందిని విధుల నుంచి తొల‌గించారు. (క్షణాల్లో ముఖం మార్చేస్తారు!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు