ధారావిలో ఒక్క‌రోజే 94 క‌రోనా కేసులు

4 May, 2020 09:14 IST|Sakshi

సాక్షి, ముంబై :  ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లోనే 94 కొత్త కోవిడ్ కేసులు న‌మోదుకాగా, ఇద్ద‌రు మ‌ర‌ణించారు. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసుల్లో ఒక్క‌రోజే ఇన్ని కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. ఇరుకైన వీధులు, అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఒకే గదిలో పది నుంచి ఇరవై మంది వరకూ నివసించ‌డం వ‌ల్ల  ధారావిలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.  పదిలక్షల మందికి పైగా నివసించే ఈ ప్రాంతంలో ఇప్ప‌టివ‌ర‌కు  590 కి పైగా కోవిడ్‌-19 కేసులు న‌మోదుకాగా, మ‌ర‌ణాల సంఖ్య 20కి పెరిగింది.  (‘ధారావి’లో కరోనా విజృంభణ)

ముంబై పురపాలక సంస్థ నుంచి కమ్యూనిటీ హెల్త్‌ కేర్‌ కార్మికులు, వైద్య బృందాలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ధారావిలో కోవిడ్‌–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మురికివాడపై ప్రత్యేక దృష్టి సారించారు. అయిన‌ప్ప‌టికీ అత్య‌ధిక జ‌న‌సాంద్ర‌త‌, ఇరుకు ప్రాంతం కావ‌డంతో భౌతిక దూరం పాటించ‌డం క‌ష్ట‌త‌రం అయ్యింది. దీంతో ప‌రిస్థితిని అదుపు చేయ‌డం అధికారులకుస‌వాల్‌గా మారింది. మున్ముందు ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌ని స్థానికులు ఆందోళ‌న చెందుతున్నారు. దేశంలో క‌రోనా మ‌హమ్మ‌రి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్ప‌టికే 40 వేల‌కిపైగా కేసులు న‌మోదు కాగా, అత్య‌ధికంగా మ‌హారాష్ర్టలోనే వెలుగుచేస్తున్నాయి. 


 

మరిన్ని వార్తలు