సూపర్‌ కాప్‌ హిమాంశు ఆత్మహత్య

12 May, 2018 03:31 IST|Sakshi
హిమాంశు (ఫైల్‌)

కేన్సర్‌ కారణంగా కొంతకాలంగా డిప్రెషన్‌లో..

ముంబైలోని నివాసంలో సర్వీస్‌ రివాల్వర్‌తో బలవన్మరణం

మూడేళ్లుగా లాంగ్‌ లీవ్‌లో..

సాక్షి, ముంబై: మహారాష్ట్ర అదనపు డీజీపీ, యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) మాజీ చీఫ్‌ హిమాంశురాయ్‌ (54) శుక్రవారం ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా ఎముకల కేన్సర్‌తో బాధపడుతున్న రాయ్‌ మధ్యాహ్నం నారీమన్‌పాయింట్‌లోని తన నివాసంలో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయారు. రివాల్వర్‌తో కాల్చుకున్న వెంటనే పక్కనున్న బాంబే ఆసుపత్రికి తీసుకెళ్లినా.. ఫలితం లేకపోయింది.

ఈయన 26/11 ముంబై దాడి మొదలుకుని ఎన్నో కీలక కేసుల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1988 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిగా కెరీర్‌ను ప్రారంభించి.. మహారాష్ట్ర అదనపు డీజీపీ వరకు ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారు. ధైర్యసాహసాలు, నీతి నిజాయితీలున్న అధికారిగా పేరొందారు. 2016 నుంచి సుదీర్ఘ సెలవులో ఉన్న రాయ్‌ మూడేళ్లుగా కేన్సర్‌కు దేశ, విదేశాల్లో చికిత్స పొందినా ఎలాంటి మార్పులేకపోవటంతో బలవన్మరణాకికి పాల్పడ్డారు. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు.

పట్టు వదలడు!
ముంబై క్రైమ్‌బ్రాంచ్‌ బాస్‌గా, ఏటీఎస్‌ చీఫ్‌గా ఈయన బాధ్యతలు నిర్వహించారు. దేశం యావత్తూ సంచలనంరేపిన ముఖ్యమైన కేసుల పరిష్కారంలో ఈయన పాత్ర కీలకం. ముంబైలో జర్నలిస్టు జ్యోతిర్మయి డే, బాలీవుడ్‌ నటి లైలాఖాన్, మరోనటి మీనాక్షీ థాపా, 2012లో ఐఏఎస్‌ అధికారి కూతురు, యువ న్యాయవాది పల్లవి పుర్యకాయస్త హత్యలు సహా పలు కేసుల్లో దోషులకు శిక్షపడేలా చేశారు. ముంబై దాడి కేసులో అమెరికన్, లష్కరే ఉగ్రవాది డేవిడ్‌ హాడ్లీ భారత్‌లో రెక్కీ నిర్వహించిన విషయంలోనూ సాక్ష్యాధారాల సేకరణలో చాలా శ్రమించి.. విజయం సాధించారు. మాలేగావ్, నాసిక్‌ ఎస్పీలుగా, నాసిక్‌ కమిషనర్‌గా, ముంబై అసిస్టెంట్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ముంబై జాయింట్‌ కమిషనర్‌ (క్రైమ్‌)గా ఉన్నప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఐపీఎల్‌ బెట్టింగ్‌ కుంభకోణం విచారణతో బాలీవుడ్, క్రికెటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఏటీఎస్‌ చీఫ్‌గా బదిలీ అయిన తర్వాత.. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని అమెరికన్‌ స్కూల్‌ పేల్చివేతకు కుట్రపన్నిన అనీస్‌ అన్సారీ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను అరెస్టు చేసి భారీ ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. ఆత్మహత్య విషయం తెలిసి పోలీసు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కొంతకాలంగా రాయ్‌ కేన్సర్‌కు చికిత్స పొందుతున్నారు. అయినా ఈ విధంగా తన జీవితాన్ని అంతం చేసుకుంటాడనుకోలేదు’ అని ముంబై మాజీ పోలీసు కమిషనర్‌ ఎమ్‌ఎన్‌ సింగ్‌ తెలిపారు.

సీఏ నుంచి ఐపీఎస్‌గా..
వృత్తిరీత్యా చార్టర్డ్‌ అకౌంటెంట్‌ అయిన హిమాంశురాయ్‌ 1988లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన భార్య భావన రాయ్‌ ఐఏఎస్‌ అధికారి. వివాహం అయిన కొంతకాలానికే ఈమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థతో కలసి పనిచేస్తున్నారు. శారీరక దృఢత్వంపై మొదట్నుంచీ ఎక్కువ ఆసక్తి చూపించే హిమాంశురాయ్‌ కేన్సర్‌ బారిన పడిన తర్వాత ఆయన మెల్లిమెల్లిగా డిప్రెషన్‌లోకి వెళ్లారు.  
 

మరిన్ని వార్తలు