కోవిడ్‌-19 : విపత్తు వేళ విధుల్లో చేరాలని పిలుపు..

10 Apr, 2020 20:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దుతో విభేదించి ప్రభుత్వ సర్వీసుకు దూరంగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి కన్నన్‌ గోపీనాథన్‌ను కోవిడ్‌-19 నేపథ్యంలో విధుల్లో చేరాలని ప్రభుత్వం కోరగా ఆయన నిరాకరించారు. ఈ సంక్షోభ సమయంలో తాను ఐఏఎస్‌ అధికారిగా కాకుండా సాధారణ పౌరుడిగా ప్రజలకు సేవలందించేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. కాగా కన్నన్‌ రాజీనామాను ప్రభుత్వం ఇప్పటివరకూ ఆమోదించకపోవడంతో తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం 33 ఏళ్ల కన్నన్‌ను కోరింది. అయితే ఇది ప్రభుత్వ వేధింపు చర్యగా అభివర్ణించిన కన్నన్‌ విధుల్లో చేరేందుకు నిరాకరించారు.

డామన్‌ డయ్యూ, దాద్రా నగర్‌ హవేలీ యంత్రాంగం సూచనల మేరకు కన్నన్‌కు లేఖ రాసిన ప్రభుత్వం రాజీనామాను ఆమోదించినప్పుడే అది అమలవుతుందని, అప్పుడు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగి విధుల నుంచి వైదొలగుతారని పేర్కొంది. మీకు నిర్ధేశించిన విధులకు హాజరు కావాలని ఆదేశించినా ఇప్పటివరకూ విధులకు హాజరు కాలేదని, కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన క్రమంలో తక్షణమే విధుల్లో చేరాలని కోరింది. కాగా తనను విధుల్లో చేరాలని ప్రభుత్వం రాసిన లేఖను తన స్పందనను జోడించి ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. తాను రాజీనామా చేసి 8 నెలలు గడిచిందని, ప్రభుత్వం తనను వేధించడమే పనిగా పెట్టుకుందని, ప్రభుత్వం ఇంకా తనను వేధిస్తుందని తెలుసని..అయినా ఈ సంక్లిష్ట సమయంలో వాలంటీర్‌గా సేవలు అందించేందుకు సిద్ధమని, ఐఏఎస్‌గా మాత్రం తిరిగి చేరేదిలేదని స్పష్టం చేశారు. (చదవండి : కరోనా మృతులు లక్షలోపే: ట్రంప్‌)

మరిన్ని వార్తలు