ఒక్కరోజులో 1,074 మంది రికవరీ

5 May, 2020 02:16 IST|Sakshi

భారత్‌లో ఒక్కరోజులో 83 మంది మృతి.. 2,573 కొత్త కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో గత 24 గంటల్లో 1,074 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రెటరీ లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఇప్పటిదాకా ఒక్కరోజులో కోలుకున్న వారిలో ఇదే అత్యధికం. రికవరీ రేటు ప్రస్తుతం 27.52 శాతానికి పెరిగిందన్నారు. ఇప్పటికే 11,706 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా నిర్ధారణకు టెస్టింగ్‌ కిట్ల కొరత లేదన్నారు. కరోనా పరీక్షల సామర్థ్యం పెంచుతున్నామన్నారు. దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో 83 మంది కరోనా కాటుతో ప్రాణాలు విడిచారు. అలాగే కొత్తగా 2,573 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం. దీంతో మొత్తం మరణాలు 1,389కు, పాజిటివ్‌ కేసులు 42,836కు చేరాయి.

సరుకు రవాణాలో సమస్యలుండొద్దు్ద  
దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య సరుకు రవాణా విషయంలో ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉత్పన్నతమైతే ట్రక్కు డ్రైవర్లు కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ ‘1930’కు ఫోన్‌ చేయాలని పేర్కొంది. ఈ కంట్రోల్‌ రూమ్‌ రోజంతా పనిచేస్తుందని కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రెటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ సోమవారం చెప్పారు. డ్రైవర్లు ‘1930’కు ఫోన్‌ చేసి సాయం పొందవచ్చు.

మరిన్ని వార్తలు