విస్తృత పరీక్షలే ఆయుధం: రాహుల్‌

17 Apr, 2020 02:39 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌పై ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. విస్తృతంగా కోవిడ్‌ పరీక్షలు నిర్వహించడమొక్కటే ప్రధాన ఆయుధమనీ, అయితే కరోనాను ఎదుర్కోవడంలో లాక్‌డౌన్‌ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వీడియోకాన్ఫరెన్సింగ్‌ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్‌ మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ప్రతి ఒక్కరూ పోరాడగలిగితే ఇతర దేశాలకన్నా భారత్‌ మంచిస్థానంలో ఉంటుందని రాహుల్‌ అన్నారు.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు ఆహారం, డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారనీ, ప్రభుత్వం ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలనీ, లేదంటే ఇది సామాజిక అస్థిరతకు దారితీయవచ్చునని రాహుల్‌ ఆందోళన వెలిబుచ్చారు. కీలకమైన పరిశ్రమలూ, చిన్నా చితకా కంపెనీలను విదేశీ కంపెనీలు కొనుగోలుచేసే ప్రమాదం ఉన్నదనీ, విదేశీ కంపెనీల బారి నుంచి సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కాపాడాలని రాహుల్‌ కోరారు. లాక్‌డౌన్‌ పరిష్కారం కాదన్న రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానాన్ని బీజేపీ తిరస్కరించింది. లాక్‌డౌన్‌ పరిష్కారం కాదని భావస్తే, కేంద్రం కన్నా ముందుగానే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనూ, కాంగ్రెస్‌ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ ని పొడిగించారని బీజేపీ జనరల్‌ సెక్రటరీ బీఎల్‌సంతోష్‌ ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు