ఆ ప్రాంతాల్లో మే 31 వరకు లాక్‌డౌన్‌!

14 May, 2020 18:32 IST|Sakshi
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే(ఫైల్‌ ఫొటో)

లాక్‌డౌన్‌ పొడిగింపు యోచనలో ‘మహా’ సర్కారు

ముంబై: మహమ్మారి కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో మే 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించనున్నట్లు సమాచారం. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌(ఎంఎంఆర్‌), పుణె, షోలాపూర్‌, ఔరంగాబాద్‌, మాలెగావ్‌ తదితర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అధ్యక్షతన గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. (ఎమ్మెల్సీగా ‘మహా’ సీఎం ఏకగ్రీవం..)

‘‘మే 17తో లాక్‌డౌన్‌ 3.0 ముగియనున్న నేపథ్యంలో హాట్‌స్పాట్లలో లాక్‌డౌన్‌ పొడిగింపు విషయంలో కేంద్రానికి లేఖ రాసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మిగతా చోట్ల కేంద్రం విధానాలనే అమలు చేస్తాం’’అని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా గురువారం నాటి సమావేశంలో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌, జల వనరుల శాఖా మంత్రి జయంత్‌ పాటిల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్‌ షిండే, పరిశ్రమల మంత్రి సుభాష్‌ దేశాయ్‌, రెవెన్యూ మంత్రి బాలాసాహెబ్‌ థోరట్‌, పీడబ్ల్యూడీ మంత్రి అశోక్‌ చవాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఇక బుధవారం కడపటి వార్తలు అందేసమయానికి మహారాష్ట్రలో 25,922 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 975 మంది మరణించారు. వీరిలో ముంబైకి చెందిన వారు 596. ముంబైలో మొత్తంగా 15, 747 వైరస్‌ బారిన పడ్డారు.  (మద్యం అమ్మకాలకు గ్రీన్‌ సిగ్నల్‌.. కానీ) 

మరిన్ని వార్తలు