1500 కి.మీ న‌డిచి చివ‌రికి క్వారంటైన్‌లో..

28 Apr, 2020 11:20 IST|Sakshi

ల‌క్నో: గూడు చేరుకునేందుకు ప‌గ‌ల‌న‌కా రాత్ర‌న‌కా కాలిబాట‌న న‌డ‌క సాగించాడు. అలా వంద‌ల కి.మీ. న‌డిచి ఊరి ద‌గ్గ‌ర‌కు రాగానే ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘ‌ట‌న సోమ‌వారం ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. ఇంసాఫ్ అలీ అనే వ్య‌క్తి ముంబైలోని వ‌సాయ్‌లో కూలీగా ప‌నిచేస్తున్నాడు. లాక్‌డౌన్ వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న అత‌డు ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని శ్రావ‌స్థి జిల్లాలో త‌న స్వ‌గ్రామానికి ప‌య‌న‌మ‌య్యాడు. మార్గ‌మ‌ధ్య‌లో తిండీ, నీళ్లూ దొర‌క్క అల్లాడిపోయాడు. అయిన‌ప్ప‌టికీ ఒంట్లో స‌త్తువ‌ను కూడ‌దీసుకుంటూ 1500 కి.మీ. న‌డుచుకుంటూ త‌న స్వ‌స్థ‌ల‌మైన మ‌త్క‌న్వా గ్రామానికి చేరుకున్నాడు. దీన్ని గ‌మ‌నించిన అధికారులు అత‌డిని ఊరి పొలిమేర‌లోనే అడ్డుకుని క్వారంటైన్‌ కేంద్రానికి త‌ర‌లించ‌గా కొద్ది గంట‌ల‌కే మ‌ర‌ణించాడు. మృతుడికి భార్య‌, ఆరేండ్ల కొడుకు ఉన్నారు. (భివండీలో తెలంగాణ ప్రజల వెతలు)

ఈ ఘ‌ట‌న‌పై శ్రావ‌స్థి జిల్లా ఎస్ఐ అనూప్ కుమార్ సింగ్‌ మాట్లాడుతూ.. "అతడిని సోమ‌వారం ఉద‌యం ఏడు గంట‌ల‌కు క్వారంటైన్ కేంద్రానికి తీసుకువచ్చారు. అనంత‌రం అల్పాహారం అందించారు. ఐదు గంట‌ల తర్వాత అత‌నికి క‌డుపులో నొప్పి మొద‌లైంది. ప‌లుమార్లు వాంతులు కూడా చేసుకున్నాడు. దీంతో అక్క‌డి సిబ్బంది డాక్ల‌ర్లకు స‌మాచార‌మందించేలోపే అత‌ను క‌న్నుమూశాడు" అని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి విచార‌ణ చేప‌డుతున్నామ‌న్నారు. కాగా అత‌డికి ద‌గ్గ‌ర న‌మూనాలు సేక‌రించి క‌రోనా ప‌రీక్ష‌ల నిమిత్తం ల్యాబ్‌కు పంపార‌ని, ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాతే మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాలు తెలుస్తాయ‌న్నారు. (లాక్‌డౌన్‌లోనూ చేతివాటం చూపించాడు!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు