జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ!

10 Apr, 2020 11:25 IST|Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ గడువు ముగింపు తేదీ సమీపిస్తున్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 14(మంగళవారం)న లాక్‌డౌన్‌ ఎత్తివేసే విషయంపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. శనివారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా బుధవారం పార్లమెంటులోని ఫ్లోర్‌లీడర్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభిస్తున్న క్రమంలో మార్చి 24న విధించిన లాక్‌డౌన్‌ ఎత్తివేయడం సాధ్యం కాదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు సామాజిక అత్యవసర స్థితిని తలపిస్తున్న తరుణంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని వ్యాఖ్యానించారు.

కాగా గురువారం నాటికి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5734కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ఒక్కరోజులో 549 కేసులు నమోదయ్యాయని.. 17 మంది మృతి చెందినట్లు పేర్కొంది. ఈ క్రమంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రులతో చర్చించిన అనంతరం లాక్‌డౌన్‌ పాక్షికంగా ఎత్తివేయాలా లేదా నిబంధనలు సడలించాలా అన్న విషయంపై ప్రధాని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల పరిస్థితులను అంచనా వేసి లాక్‌డౌన్‌పై నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.(కరోనాపై కలిసి జయిద్దాం : ట్రంప్‌తో మోదీ)

అదే విధంగా ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న తరుణంలో కొన్ని రంగాలకు మినహాయింపు ఇవ్వాలా అన్న విషయంపై కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎయిర్‌లైన్ల కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని.. భౌతిక దూరం పాటిస్తూ(సీటు వదిలి సీటు) విమానాలు నడిపే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇక నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతినివ్వాలని... విద్యాసంస్థలు, మతపరమైన ప్రార్థనాస్థలాలు యథావిధిగా మూసివేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిపాయి.(‘సోషల్‌ ఎమర్జెన్సీ’ తరహా పరిస్థితి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు