హోం శాఖకు రూ.83 వేల కోట్లు

2 Feb, 2017 04:51 IST|Sakshi
  • గత ఏడాది కన్నా 11 శాతం ఎక్కువ
  • సీఆర్‌పీఎఫ్‌కు అత్యధికంగా రూ.17,868 కోట్లు
  • న్యూఢిల్లీ: ఈసారి బడ్జెట్‌లో కేంద్ర హోంశాఖకు భారీగా కేటాయింపులు చేశారు. పోలీసు బలగాలను ఆధునీకరించడంపై దృష్టిపెట్టి ఈసారి రూ.83 వేల కోట్లు కేటాయించారు. 2016–17లో ఇచ్చిన దానికంటే ఇది ఈసారి 11.24 శాతం ఎక్కువ. గత ఏడాది రూ.75,355.48 కోట్లు ఇవ్వగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.83,823.30 కోట్లు కేటాయించారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)కు రూ.1,577.07 కోట్లు కేటాయింపులు చేశారు. తాజా బడ్జెట్‌లో హోంశాఖ అధీనంలోని ఏడు పారామిలిటరీ దళాలకు 54,985.11 కోట్లు ప్రతిపాదించారు. ఇది గత బడ్జెట్‌లో రూ.52,443 కోట్లుగా ఉంది. అంతర్గత భద్రతకు, మావోయిస్టులు, మిలిటెంట్ల ఆపరేషన్లు నిర్వహించే సీఆర్‌పీఎఫ్‌కు అత్యధికంగా రూ.17,868.53 కోట్లు దక్కింది.

    భారత్‌–పాక్, భారత్‌–బంగ్లాదేశ్‌ సరిహద్దులోని బీఎస్‌ఎఫ్‌కు రూ.15,569.11 కోట్లు ఇచ్చారు. సీఐఎస్‌ఎఫ్‌కు రూ.6,686.25 కోట్లు కేటాయించారు. ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీస్‌ (ఐటీబీపీ)కి రూ.4,824.31 కోట్లు,  అస్సాం రైఫిల్స్‌కు రూ.4,801.84 కోట్లు కేటాయించారు.  సశస్త్రసీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ)కు రూ.4,320.67 కోట్లు, ఉగ్రవాద నిరోధక చర్యల్లో పాలుపంచుకునే జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ)కి రూ.816.10 కోట్లు కేటాయించారు. కేంద్ర హోంశాఖ అధీనంలో పనిచేసే ఢిల్లీ పోలీస్‌కు బడ్జెట్‌లో రూ.5,910.28 కోట్లు ఇచ్చారు. పాక్, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ముళ్లకంచె ఏర్పాటుకు, రోడ్ల నిర్మాణానికి, నిఘా పరికరాల ఏర్పాటుకు బడ్జెట్‌లో రూ.2,355.68 కోట్లు ఇచ్చారు.  సీఏపీఎఫ్, కేంద్ర పోలీసు సంస్థల భవనాల ప్రాజెక్టులకు గత ఏడాది కంటే 33 శాతం అధికంగా రూ.4,008,06 కోట్లు, ఎస్పీజీకి రూ.389.25 కోట్లు, నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌కు రూ.45.57 కోట్లు,  ఐవీఆర్‌ఎఫ్‌టీకు రూ.66 కోట్లు, హోం శాఖలో పరిశోధనల ప్రోత్సాహకాలకు రూ.2,983 కోట్లు, మహిళల భద్రతకు ఉద్దేశించిన నిర్భయ నిధికి రూ.50 కోట్లు కేటాయించారు.

మరిన్ని వార్తలు