‘మాకు రాదులే’ అనుకోవడం ప్రమాదకరం

28 Mar, 2020 15:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మాకు రాదులే!’ అన్న ధీమాతో ఎక్కువ మంది యువతీ యువకులు  ‘లాక్‌డౌన్‌’ ఆంక్షలను ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నారు. ఈ పరిస్థితి ఒక్క తెలంగాణాలోనే కాకుండా దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ఆ మాటకొస్తే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న అమెరికా, బ్రిటన్‌లలో కూడా కనిపిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణలో విధించిన ‘లాక్‌డౌన్‌’ ఆంక్షలను ఉల్లంఘించిన వారికి లాఠీ దెబ్బలు రుచి చూపినా, మోకాళ్లపై నడిపించినా, బింగీలు తీయించినా, రోడ్లపై సాష్టాంగ నమస్కారాలు చేయించినా ఆశించిన మార్పు కనిపించడం లేదు. 
(చదవండి: కరోనా : నగ్నంగా బైటికొచ్చి..వృద్ధురాలిపై దాడి, మృతి)

సామాజిక దూరం పాటించాల్సిందిగా అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో ఆంక్షలు విధించిన తొలిరోజే పార్కులు, పబ్బులు జనంతో కిటకిటలాడడం, లండన్‌లో వెయ్యి పౌండ్ల జరిమానా, ఆరు నెలల కారాగార శిక్ష అని ప్రకటించినప్పటికీ సముద్రతీరాలు జనంతో కిక్కిరిసి పోవడానికి ‘మాకు రాదులే!’ అన్న ధీమానే కారణం. దీన్ని మానసిక శాస్త్రం ప్రకారం ‘ఆశావాద దృక్పథం’గా వ్యవహరిస్తారు. బ్రిటన్‌తోపాటు ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌ దేశాలకు చెందిన నాలుగు వేల మందిని ఓ సైకాలజీ వెబ్‌సైట్‌ కరోనా వైరస్‌ గురించి ఇంటర్వ్యూ చేయగా.. సగం మందికి పైగా తమకు వైరస్‌ వచ్చే అవకాశం లేదని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అవకాశాలు చాలా తక్కువని సగంకన్నా తక్కువ మంది చెప్పారు. వైరస్‌ సోకే అవకాశాలు ఉన్నాయని కేవలం ఐదు శాతం మంది మాత్రమే అంగీకరించారు. 
(చదవండి: ఎన్నిసార్లు ముఖాన్ని తాకుతామో తెలిస్తే.. షాకవుతారు)

సాధారణంగా మనుషులకు ఆశవాదా దక్పథం ఉంటే మంచిదే. అనవసర భయాందోళనలను దూరం చేయడంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కానీ కరోనా లాంటి భయానక పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం అర్థరహితమే అవుతుంది. తమకు మాత్రమే కరోనా వచ్చే అవకాశం ఉందంటే సాధారణంగా ప్రజలు భయపడతారు. తమతో పాటు ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఉందన్నప్పుడు వారి మానసిక పరిస్థితి మారుతుంది. ఇతరులకు రావచ్చుగానీ తమకు రాదనే ధీమా వారిలో ఏర్పడుతుంది. ఇది ఒకరకంగా సామాజిక ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకోవడంలో భాగమేనని అమెరికాలోని డికిన్‌సన్‌ కాలేజీలో పనిచేస్తున్న సైకాలజీ ప్రొఫెసర్‌ మేరి హెల్‌వెగ్‌ లార్సన్‌ అభిప్రాయపడ్డారు. పొగతాగడం వల్ల ఊపిరితిత్తులు లేదా గొంతు క్యాన్సర్‌ వస్తుందని తెలిసినప్పటికీ తమకు రాదనే ధీమాతో పొగతాగడం ఎంత ప్రమాదమో ఈ కరోనా వైరస్‌ రాదనుకోవడం కూడా అంతే ప్రమాదమని లార్సన్‌ హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు