లాక్‌డౌన్‌: రైలు ప్రయాణికుల ఆశలపై నీళ్లు

2 May, 2020 19:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైలు ప్రయాణికులకు మరోసారి నిరాశ ఎదురయింది. మే 3 తర్వాత స్వస్థలాలకు వెళ్లాలని భావిస్తున్న ప్రయాణికుల ఆశలపై రైల్వే శాఖ నీళ్లు చల్లింది. ప్రయాణికుల రైళ్లు, సబర్బన్‌ రైళ్ల రద్దును మే 17 వరకు కొనసాగించనున్నట్టు దక్షిణమధ్య రైల్వే శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పార్శిల్‌, రవాణా రైళ్లుయథాతథంగా నడుస్తున్నాయని దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్‌ రాకేష్‌ స్పష్టం చేశారు. (స్పెషల్‌ ట్రైన్‌ ఎక్కాలంటే.. ఇవి పాటించాలి)

టిక్కెట్ల కోసం రైల్వే స్టేషన్లకు రావొద్దు
లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు, తీర్థయాత్రికులు, ఇతర వ్యక్తులను శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల అభీష్టం మేరకు, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు లోబడి శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు తెలిపింది. ఈ రైళ్లలో ప్రయాణం చేయదలచిన వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి, నమోదు చేసుకున్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించే ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది. ‘వ్యక్తులకు టికెట్లు జారీ చేయడం వీలు పడదు. బృందాలకు కూడా టిక్కెట్లు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి టిక్కెట్ల కోసం ఎవరూ నేరుగా రైల్వే స్టేషన్లకు రావొద్ద’ని దక్షిణమధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. (విమాన ప్రయాణాల్లో భారీ మార్పులు)

మరిన్ని వార్తలు