భారత్ చేరుకున్న కేరళ నర్సులు, తెలుగువారు

5 Jul, 2014 09:57 IST|Sakshi

ఇరాక్లో సున్నీ ఉగ్రవాదుల చెరలో చిక్కుకుని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపి.. ఎట్టకేలకు వారి చెరవీడిన కేరళ నర్సులు ముంబై చేరుకున్నారు. ఉదయం 8.43 గంటలకు వీరు బయల్దేరిన ప్రత్యేక విమానం ముంబైలో దిగింది. ఇందులో 46 మంది నర్సులతో పాటు మరో 137 మంది ఇతరులు కూడా ఉన్నారు. ఉదయం 11.55 గంటలకు ఇది కొచ్చి చేరుకుంటుంది. అక్కడినుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు హైదరాబాద్ వెళ్తుంది. చిట్టచివరకు సాయంత్రం 5.40 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది.

కాగా, కొచ్చి విమానాశ్రయంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ స్వయంగా వెళ్లి వారిని మాతృభూమికి ఆహ్వానిస్తారు. నర్సుల కోసం ప్రత్యేకంగా ఒక ఇమ్మిగ్రేషన్ డెస్కును ఏర్పాటు చేశారు. భారతీయ దౌత్యాధికారుల చొరవతో విడుదలైన నర్సులంతా కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ నుంచి బయల్దేరిన విమానంలో భారత్ చేరుకున్నారు. ఇరాక్లో చిక్కుకున్న మరికొందరు భారతీయులు కూడా ఇదే విమానంలో ఉన్నారు. మొత్తం 183 మంది ప్రయాణికులుండగా వారిలో 23 మంది విమాన సిబ్బంది, ముగ్గురు ప్రభుత్వాధికారులు ఉన్నారు. 46 మంది కేరళ నర్సులు కాక మిగిలినవారిలో వంద మంది తెలుగువారని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు