కరోనా: రెండు రోజులు ర్యాపిడ్‌ టెస్టులు బంద్‌!

21 Apr, 2020 19:27 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా నియంత్రణ చర్యల్లో కీలకమైన ర్యాపిడ్‌ టెస్టులు రెండు రోజులపాటు నిలుపుదల చేయాలని రాష్ట్రాలకు భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్‌) మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్‌ నిర్ధారణకు రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసిన ర్యాపిడ్‌ టెస్టుల ఖచ్చితత్వంపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ‘ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లలో ఎటువంటి లోపాన్ని విస్మరించవద్దు’ అని స్పష్టం చేసింది. కాగా, హాట్‌స్పాట్‌ కేంద్రాలు, కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్‌ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం  5 లక్షల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను పాలు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. 
(చదవండి: కరోనా రిలీఫ్‌ : కోలుకునే రేటు పెరిగింది)

ఈక్రమంలో ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లలో కోవిడ్‌ నిర్ధారణ ఖచ్చితత్వం కేవలం 5.4 మాత్రమే ఉందని రాజస్తాన్‌ తెలిపింది. దాంతోపాటు తమ రాష్ట్రంలో నేడు ర్యాపిడ్‌ టెస్టింగ్‌ను ఆపేసింది. ‘రాజస్తాన్‌తోపాటు మరో రెండు రాష్ట్రాలు ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లపై అనుమానాలు వ్యక్తం చేశాయి. నిజానిజాలు కనుగొంటాం. అప్పటి వరకు వాటిద్వారా పరీక్షలు చేయొద్దు’అని ఐసీఎంఆర్‌ ఎపిడెమాలజీ హెడ్‌ డాక్టర్‌ గంగాఖేల్కర్ తెలిపారు. రెండు రోజులపాటు తమ ప్రతినిధులు అన్ని రాష్ట్రాలకు వెళ్లి టెస్టింగ్‌ కిట్ల పనితీరును పరిశీలిస్తారని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రక్త నమూనాలు తీసుకొచ్చి మరోసారి పరీక్షిస్తామని అన్నారు. ఈ వ్యవహారంపై రెండు రోజుల్లో సమగ్ర నివేదిక వస్తుందని.. ఒకవేళ టెస్టింగ్‌ కిట్లలో లోపాలు ఉంటే.. వాటిని రిప్లేస్‌ చేయాలని తయారీ కంపెనీని కోరతామని అన్నారు.
(చదవండి: 500 దాటిన కరోనా మరణాలు)

మరిన్ని వార్తలు