జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు ఎలా!?

24 Jun, 2020 19:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘దీన్ని మేం అనుమతించినట్లయితే ఆ భగవంతుడైన జగన్నాథుడు మమ్మల్ని క్షమించరు’ అని ఒడిశాలో ప్రతి ఏటా జరిగే పూరి జగన్నాథ స్వామి రథయాత్రను ఈసారి కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అనుమతించాలా, లేదా? అన్న అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే చేసిన వ్యాఖ్య ఇది. ప్రతి ఏటా జరిగే జగన్నాథుడి రథయాత్రలో పది నుంచి పన్నెండు లక్షల మంది భక్తులు పాల్గొంటారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేటి పరిస్థితుల్లో అంత మంది భక్తులను కట్టడి చేయడం తమ వల్ల కాదంటూ ఒడిశా ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ పరిస్తితుల్లో రథయాత్రకు అనుమతిస్తే ఆ జగన్నాథుడే క్షమించరంటూ సుప్రీంకోర్టు జూన్‌ 18వ తేదీన స్టే ఉత్తర్వులు జారీ చేసింది. (ఆ దేవుడే మనల్ని క్షమించడు: సుప్రీం)

జూన్‌ 22వ తేదీ, సోమవారం ఈ అంశం మళ్లీ సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు అనూహ్యంగా జగన్నాథ రథయాత్రపై స్టే ఉత్తర్వులను ఎత్తివేశారు. 500 మంది చొప్పున మూడు రథాలను లాగేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టు అనేక షరతులను విధించింది. రథానికి 500 మంది అంటే మూడు రథాలకు కలిసి 1500 మంది భక్తులవుతారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు, సిబ్బంది, అధికారులు, పోలీసు సిబ్బందిని కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. రథాలను లాగే భక్తులను ఎలా ఎంపిక చేయాలి? వారికి కరోనా లేదని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు ఎలా నిర్వహించాలి? రథయాత్ర జరగుతుందని తెల్సిన భక్తులు లక్షలాదిగా కాకపోయినా వేలాదిగా తరలి వస్తే? వారిని ఎలా అడ్డుకోవాలి? ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని వేధిస్తున్న ప్రశ్నలివి.

దేశంలో కరోనా బాధితుల సంఖ్య దాదాపు నాలుగున్నర లక్షలకు చేరుకున్న నేపథ్యంలో వైరస్‌ లక్షణాలు కలిగిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం కష్టమవుతున్న పరిస్థితుల్లో అంతమంది భక్తులకు ఎలా కరోనా పరీక్షలు నిర్వహించగలమని అధికారులు తలపట్టుకున్నారు. ఈ రకంగా అనుమతులు ఇవ్వడం వల్ల ఇతర పరిణామాలకు దారితీస్తాయన్న అభిప్రాయం ఉంది. అహ్మదాబాద్‌లో జగన్నాథుడి రథయాత్రను నిర్వహించేందుకు తమకు అనుమతించడంటూ గుజరాత్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలవడమే నిదర్శనమని నిపుణుల అభిప్రాయం. (ఆగస్టు వరకు రైలు ప్రయాణాలు లేనట్టేనా?)

మరిన్ని వార్తలు