ఢిల్లీలో తెలుగు మీడియా ప్రతినిధికి కరోనా

3 May, 2020 09:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు మీడియా ప్రతినిధి ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక్కడి అపోలో ఆస్పత్రిలో శుక్రవారం పరీక్ష జరపగా.. శనివారం ఉదయానికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సహచర తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (టీయూడబ్ల్యూజే) ప్రతినిధులు తోడుగా వెళ్లి ఆస్పత్రిలో చేర్చగా.. వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు. టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్‌ ఢిల్లీ టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌తో మాట్లాడి పలు సూచనలు చేశారు. (53 మంది ర్నలిస్టులకు రోనా)

మీడియా అకాడమీ నుంచి బాధితుడి చికిత్సకు, కుటుంబ అవసరాల నిమిత్తం రూ.20 వేలు డిపాజిట్‌ చేయనున్నట్టు తెలిపారు. తోటి జర్నలిస్టులు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తే రూ.10 వేలు డిపాజిట్‌ చేస్తామని భరోసా ఇచ్చారు. టీయూడబ్ల్యూజే ప్రతినిధుల అభ్యర్థన మేరకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా అపోలో ఆసుపత్రి వర్గాలతో మాట్లాడారు. జర్నలిస్టు పనిచేస్తున్న టీవీ చానల్‌ యాజమాన్యం తక్షణ సాయంగా రూ.లక్ష ఆస్పత్రిలో జమ చేసింది. టీయూడబ్ల్యూజే సభ్యులు, ఢిల్లీ ఆంధ్రా జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (ఆజాద్‌) సభ్యులు తక్షణ చర్యలపై, జర్నలిస్టుల సంక్షేమంపై శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమై చర్చించారు.  (మీడియా మిత్రులకు కేజ్రీవాల్గుడ్న్యూస్)

ఉప రాష్ట్రపతి ఆరా 
అపోలో ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్లతో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడి మీడియా ప్రతినిధి క్షేమంపై ఆరా తీశారు. ఉప రాష్ట్రపతి జర్నలిస్టు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి భరోసా ఇచ్చారు. కాగా జర్నలిస్టుల అభ్యర్థన మేరకు ఢిల్లీ తెలుగు మీడియా ప్రతినిధులందరికీ కోవిడ్‌ టెస్ట్‌ చేయించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.   

మరిన్ని వార్తలు