ఢిల్లీ గుణపాఠం కనువిప్పేనా?

29 Apr, 2017 06:16 IST|Sakshi
ఢిల్లీ గుణపాఠం కనువిప్పేనా?

సందర్భం
ఢిల్లీ మునిసిపల్‌ కౌన్సిల్‌ (ఎంసీడీ) ఎన్నికలకు ముందు రోజు సాయంత్రం నేను ఓలా విజ్‌డమ్‌ ట్యాక్సీని బుక్‌ చేశాను. పోలింగ్‌ జరగడానికి ముందురోజు ఇష్టాగోష్టి సమావేశంలో పాల్గొని ఇంటికెళుతూ మేం ఒక ట్యాక్సీని మాట్లాడుకున్నాం. మమ్మల్ని డ్రాప్‌ చేస్తూ, డ్రైవర్‌ ‘మీరు రాజకీయ పార్టీకి చెందినవారా’ అని అడిగాడు. నా ముఖాన్ని అతడు స్పష్టంగా గుర్తుపట్టలేకపోయాడు. అదేమంత పెద్ద విషయం కాదని అతడికి చెబుతూ మరుసటి రోజు జరగనున్న ఎంసీడీ ఎన్నిక గురించి ఏమనుకుంటున్నావని అడిగాను. అతడు సాంప్రదాయికంగా కాంగ్రెస్‌ ఓటరట. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారిగా బీజేపీకి ఓటేశాడు. కానీ 2015లో అతడు కేజ్రీవాల్‌ పార్టీకి మారాడు. మరి ఈసారి? తన వార్డు అభ్యర్థుల పేర్లను అతడు గుర్తుపెట్టుకోలేదు కానీ ఈసారి మాత్రం మోదీకే ఓటేస్తానని చెప్పాడు.

ఢిల్లీ మునిసిపల్‌ కౌన్సిస్‌ పనితీరు గురించి తన అభిప్రాయాన్ని అడిగాను. వాళ్లు ఒక్క పనీ చేయలేదు (కుచ్‌ కామ్‌ నíహీ కియా) అని నొక్కి చెప్పాడు. గత పదేళ్లుగా ఎంసీడిని పాలిస్తున్నది బీజేపీనే అని అతడికి గుర్తు చేశాను. కేజ్రీవాల్‌ మాకు ద్రోహం చేశాడు అని అతడు కొట్టిపడేశాడు. ఇప్పుడు తన నమ్మకం పూర్తిగా మోదీపైనే ఉందన్నాడు. ‘ఉత్తరప్రదేశ్‌లో ఆయన యోగి వంటి ఉత్తమ ముఖ్యమంత్రిని ఇచ్చారు. ఢిల్లీలో కూడా ఆయన మంచి ప్రభుత్వానికి హామీ ఇస్తారు’ అనేశాడు. నాకు మాటల్లేకుండా పోయాయి. భయపడ్డాను కూడా. అయితే రాజకీయాల గురించి ఆ వోలా డ్రైవర్‌ నాకు తెలియనిది కొంత చెప్పాడు.

బీజేపీకి అనుకూలంగా పెద్ద స్థాయిలో ఓట్లు సైలెంటుగా బదిలీ అవుతున్నాయని ఎన్నికల ప్రచారం ముగింపు నాటికే తేలిపోయింది.  ఎంసీడీ పనితీరుపై ఓటర్లు దృష్టి పెట్టలేదని స్పష్టమైంది. అయితే ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వంపై నేను చేసిన విమర్శలపైనే వారు మరింత ఆసక్తి చూపారు. పోలింగు రోజున బీజేపీ పూర్తి ఆధిక్యత సాధించనుందంటూ పరిశీలకులు చేసిన అంచనాను ఎగ్జిట్‌ పోల్స్‌ ధ్రువపర్చాయి. తన సమీప ప్రత్యర్థిపై బీజేపీ 20 శాతం కంటే అదనంగా ఆధిక్యత సాధించనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. అంతటి ఆధిక్యత సహజంగానే సీట్ల పరి భాషలో సంపూర్ణమైన క్లీన్‌ స్వీప్‌ను సాధించిపెడుతుంది.

అలాంటి ఫలితం భయాన్ని, విషాదాన్ని కూడా కలిగిస్తుంది. అత్యంత చెత్త పనితీరును ప్రదర్శించే దేశీయ మునిసిపాలిటీల్లో ఢిల్లీలోని  మూడు మునిసిపాలిటీలుకూడా చేరిపోయి ఉంటాయనడంలో సందేహమే లేదు. ఢిల్లీలోని సగం జనాభాకు ఆశ్రయమిస్తున్న తూర్పు, ఔటర్‌ ఢిల్లీ ప్రాంతాలను సందర్శిస్తే, ఇక్కడి పట్టణ మౌలిక వసతులు యూపీ, బీహార్‌లోని పట్టణాలకంటే ఏమంత మెరుగ్గా ఉండవు. గత సంవత్సర కాలంగా ఢిల్లీనగరం చికున్‌ గున్యా, డెంగ్యూ వ్యాధులతో సతమతమైంది. ఇక వాయు కాలుష్యం అయితే అన్ని ప్రమాద హెచ్చరికలను అధిగమించేసింది. ఈ పరిస్థితికి ఎవరు కారణం అనే విషయంలో రెండు వాదనలకు తావులేదు. ఢిల్లీలోని మునిసిపల్‌ కార్పొరేషన్లు గత పదేళ్లుగా బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. పట్టణ ప్రభుత్వాలు ఎలా ఉండకూడదో ఈ మునిసిపాలిటీలు టెక్ట్స్‌ బుక్‌ ఉదాహరణగా నిలుస్తాయి.

నిజం గానే ఢిల్లీ ప్రభుత్వం వద్ద వనరులు లేక అవి కునారిల్లుతున్నాయి. ఏమాత్రం పనిచేయని పాలకపార్టీకి ఢిల్లీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? స్పష్టంగానే దీనికి సమాధానం ఈవీఎం ట్యాంపరింగ్‌లో మాత్రం లేదు. బాధ్యతారహిత ఆరోపణలు చేయడానికి బదులుగా, ప్రజలు ఓటేస్తున్నారు కాబట్టే బీజేపీ గెలుస్తోందన్న వాస్తవాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. స్పష్టంగానే, బీజేపీకి ఓటు వేస్తున్నవారు పనిచేయని ఢిల్లీ మునిసిపాలిటీ కౌన్సిళ్లకు తాము రివార్డు అందిస్తున్నట్లు భావించడం లేదు. ఈ ఎన్నికల్లో తీవ్రమైన మునిసిపల్‌ సమస్యలను బీజేపీ పక్కకు దాటివేయిం చగలిగింది.

దీనికి బదులుగా జాతీయవాదం, కశ్మీర్, గోవధ, జాతీయ భద్రత వంటి ఎంసీడీలకు సంబంధం లేని అంశాలపై చర్చించేలా ఓటర్లను, మీడియాను బీజేపీ ఏమార్చగలిగింది. బాగా చెడ్డపేరు వచ్చిన ప్రస్తుత కౌన్సిలర్లను మరోసారి నామినేట్‌ చేయకుండా చేసి ప్రజాగ్రహం తనపై మళ్లకుండా అది జాగ్రత్త పడింది. మరోవైపున ఆమ్‌ ఆద్మీ పార్టీ సైతం ఈ ఎన్నికను కేజ్రీవాల్‌పై వ్యక్తిగత రిఫరెండంగా మార్చి నిజమైన మునిసిపల్‌ సమస్యలపై చర్చను దారిమళ్లించింది.. చివరికి ఈ ఎన్నికలు సీఎం, పీఎంలకు మధ్య పాపులారిటీ పోటీగా మారిపోయాయి.

ఢిల్లీ ప్రజలు సీఎంకు బదులుగా పీఎంను  ఎంచుకున్న్టట్లుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా మోదీ మ్యాజికల్‌ ప్రభంజనంతో దీన్ని వివరించలేం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 2015లో బీజేపీని తుంగలో తొక్కివేసిన రోజు కూడా మోదీ ఏమంత తక్కువ శక్తిమంతంగా లేరు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, హర్యానా విజయాలతో మోదీ పాపులారిటీ ఒక మెట్టుపైనే ఉండేది. ఇప్పటివలే కాకుండా మోదీ ఆనాడు పార్టీ స్థానిక వ్యతిరేక ఓటును కూడా ఎదుర్కొనలేదు. మనమిప్పుడు ఈ కష్టమైన ప్రశ్న నుంచి తప్పించుకోలేం. 2015లో మోదీ వేవ్‌ ఎందుకు పనిచేయలేదు. 2017లో మాత్రం పనిచేస్తున్నట్లు ఎందుకు కనిపిస్తోంది? తేడా ఎక్కడుందంటే 2015 ఫిబ్రవరి నుంచి ఆప్‌ ప్రభుత్వంతో ఢిల్లీ పొందిన అనుభవంలోనే ఉంది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆప్‌ తన నైతికాధికారాన్ని కోల్పోయింది. విద్యుత్‌ బిల్లులను పాక్షికంగా తగ్గిం చడం, స్కూల్‌ విద్య కోసం అదనపు నిధులను కేటాయించడం మినహా ప్రభుత్వం తన సమర్థతను ఏమాత్రం ప్రదర్శించక పోవడంతో సుపరిపాలనపై అది చేసిన వాగ్దానం తేలిపోయింది.

హామీలను నెరవేర్చడానికి బదులుగా ఆప్‌ ప్రభుత్వం కేంద్రానికి, దాని ప్రతినిధి లెఫ్టినెంట్‌ గవర్నర్‌కి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ కాలం గడిపేసింది. ఆ ఆరోపణల్లో కొన్ని నిజమైనవే కావచ్చు. కాని ఈ ఆరోపణలపైనే ఎక్కువగా అది ఆధారపడినందువల్లే నా ఓలా డ్రైవర్‌ వంటి ఢిల్లీ ప్రజలను విసుగెత్తించేసింది. ఈ వ్యక్తిగత రిఫరెండాన్ని కోల్పోవడంతో అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తి ఆరాధన తనకే ఎదురు తగిలింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిసిన ఆప్‌ ఇప్పుడు నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలి పోతోంది. ఈ పార్టీ ఇప్పటికైనా కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటుందనే ఆశిద్దాం. ఢిల్లీలో ఎంసీడీ ఎన్నిక భారత రాజకీయాల్లో పెద్దన్నగా బీజేపీ వికాసానికి సంబంధించిన ఒక దశను పూర్తి చేసింది. ఇప్పటికైనా ప్రతిపక్షాలు వాస్తవాన్నిగుర్తించనట్లయితే అవి కోలుకోవడం చాలా కష్టం.

వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యుడు
యోగేంద్ర యాదవ్‌

మొబైల్‌ : 98688 88986 ‘

Twitter : @_YogendraYadav

>
మరిన్ని వార్తలు