అమిత్‌ షా వర్సెస్‌ టీఎంసీ

10 May, 2020 04:27 IST|Sakshi

న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం అన్యాయమని హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ఈ మేరకు బెంగాల్‌ సీఎం మమతకు లేఖ రాశారు. ‘వేరే ప్రాంతాల్లో చిక్కుకున్న కూలీలను సొంతూళ్లకు తీసుకువచ్చేందుకు కేంద్రం రైళ్లను ఏర్పాటు చేసింది. కానీ, బెంగాల్‌ ప్రభుత్వం మాకు సహకరించడం లేదు. ఆ రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. దీంతో కార్మికులు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై అధికార టీఎంసీ నేత, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అయిన అభిషేక్‌ బెనర్జీ తీవ్రంగా స్పందించారు.

‘లాక్‌డౌన్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన హోం మంత్రి.. బెంగాల్‌ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ఆయన.. చాలా వారాల మౌనం తర్వాత గొంతు విప్పారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. షా తన ఆరోపణలను రుజువు చేయాలి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి’ అని ట్విట్టర్‌లో డిమాండ్‌ చేశారు. కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, తెలంగాణల్లో ఉన్న రాష్ట్రానికి చెందిన వలస కూలీల తరలింపునకు ఇప్పటికే 8 రైళ్లను ఏర్పాటు చేశామనీ, ఇందులో మొదటిది త్వరలోనే హైదరాబాద్‌ నుంచి మాల్దాకు చేరుకోనుందని తెలిపారు. రాష్ట్రంలోకి వలస కార్మికులను రానివ్వడంలేదంటూ ఆరోపిస్తున్న అమిత్‌ షా..మహారాష్ట్రలో 16 మంది కూలీల మరణానికి రైల్వే మంత్రిని బాధ్యుణ్ని చేస్తారా అని టీఎంసీ ఎంపీ కకోలీ ఘోష్‌ దస్తీదార్‌ ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు