దేశమంతా చంద్రబాబును తిట్టిపోసింది : జీవీఎల్‌

2 Mar, 2019 11:31 IST|Sakshi

పీకే అంటే పవన్‌ కల్యాణ్‌కాదు.. పాకిస్తాన్‌ అని వ్యాఖ్య

సాక్షి, విజయవాడ : దేశ ప్రజలంతా ప్రధాని మోదీ దౌత్యాన్ని, వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ధైర్యసాహసాలను కొనియాడుతుంటే కొందరు మాత్రం కేంద్రం చర్యలను తప్పు పడుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. ఓవైపు పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సర్జికల్‌ స్ట్రైక్స్‌పై ప్రశంసలు వర్షం కురుస్తోంటే.. మరోవైపు రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు, పవన్‌ కల్యాన్‌, మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై నిందలు మోపీ పాకిస్తాన్‌లో హీరోలు కావాలని ఉబలాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. (ఏపీలో అవినీతి,కుటుంబ పాలన)

దేశమంతా తిట్టిపోసింది..
పాకిస్తాన్‌పై భారత్‌ చర్యలను తప్పుబడుతూ చంద్రబాబు, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జీవీఎల్‌ అన్నారు. చంద్రబాబుకు దేశమంతా చివాట్లు పెట్టిందని చెప్పారు. దాంతో ‘యూటర్న్‌ బాబు’గా పేరొందిన చంద్రబాబు మాట మార్చారని తెలిపారు. జనసేన అధినేత పవన కల్యాణ్‌ (పీకే) కూడా ఈ మధ్య పాకిస్తాన్‌పై ప్రతీకారం విషయంలో వింతగా మట్లాడుతున్నారని జీవీఎల్‌ విమర్శలు గుప్పించారు. పీకే అంటే పాకిస్తాన్‌ షార్ట్‌కట్‌ అని అక్కడి జనం భ్రమపడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభావం వల్లనే పవన్‌ అలా మాట్లాడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఒకప్పడు పెదబాబు, చినబాబును విమర్శించే పవన్‌.. ఇప్పుడు వారిని పల్లెత్తు మాట కూడా అనడం లేదని చెప్పుకొచ్చారు. (అభినందన్‌ ఆగయా..)

స్థాయి సరిపోవడం లేదని పీకేని తెచ్చారా..
నిన్నటి వరకు హీరో శివాజీతో అర్థంపర్థంలేని విమర్శలు చేయించిన చంద్రబాబు తాజాగా పవన్‌ను తెరమీదకి తీసుకొచ్చాడని జీవీఎల్‌ చురకలంటించారు. చిన్న హీరో స్థాయి సరిపోవడం లేదని, పెద్ద హీరోతో మాట్లాడిస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. పవన్‌ మాటలను ప్రధానంగా పాకిస్తాన్‌ వాడుకుంటోందని, ఓట్ల కోసం జాతీయ భద్రత అంశాలను వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా పవన్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని కోరారు. ‘ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో తెలిస్తేనే పవన్‌కు ప్రజాదరణ ఉంటుంది’ అని సూచించారు.

సాధ్యం కాదు కాబట్టే..
విశాఖ రైల్వే జోన్‌తో ప్రధాని మోదీకి పేరొస్తుందని చంద్రబాబు గాబరా పడుతున్నారని జీవీఎల్‌ విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన అనేక పథకాలకు స్టిక్కర్లు వేసుకునే సీఎం చంద్రబాబు రైల్వే జోన్‌కు అలా చేసే అవకాశం లేకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటి విశాఖ బహిరంగ సభలో ఏపీకి ఏం చేశామో ప్రధాని మోదీ చెప్పారని.. చంద్రబాబు బండారాన్ని బయటపెట్టారని తెలిపారు.

మరిన్ని వార్తలు