చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసానికి మద్దతివ్వండి 

10 Mar, 2018 00:55 IST|Sakshi

     టీడీపీకి వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సవాల్‌

     ప్రత్యేక హోదా పోరుకు కలిసి రావాలని హితవు 

     ప్రధాని వద్ద హోదా నినాదం ఎందుకు వినిపించలేదో చెప్పాలని నిలదీత

     రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని ఆగ్రహం

     ప్రజా వ్యతిరేకత వల్లే రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని మండిపాటు    

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రయోజనాలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై తాము ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతునివ్వాలని టీడీపీకి వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సవాల్‌ విసిరారు. ఇప్పటికైనా కుయుక్తులు ఆపి.. హోదా పోరుకు కలసి రావాలని టీడీపీకి హితవు పలికారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రానికి కేంద్రం ఎంతో చేసిందని.. పార్టీ ఆదేశం మేరకే విధిలేని పరిస్థితుల్లో రాజీనామాలు చేశామంటూ సుజానా చౌదరి చెప్పడాన్ని బొత్స తప్పుబట్టారు. వాళ్లు రాష్ట్ర ప్రజల కోసం మనస్ఫూర్తిగా రాజీనామాలు చేయలేదనే విషయం దీన్ని బట్టి అర్థమైపోతోందన్నారు. ప్రత్యేక హోదా కోసమే రాజీనామా చేశామని ప్రధానితో చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు ఉండటం శోచనీయమన్నారు. 5 కోట్ల ఆంధ్రుల డిమాండ్‌ అయిన ప్రత్యేక హోదాపై ప్రధానిని ఎందుకు నిలదీయలేకపోయారని ప్రశ్నించారు.. 

జైట్లీ కొత్తగా ఏం చెప్పలేదే..!
ప్రత్యేక హోదా గురించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కొత్తగా ఇప్పుడు చెప్పిందేమీ లేదని బొత్స అన్నారు. గతంలోనే ప్రత్యేక హోదా ఇవ్వబోమని జైట్లీ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అప్పుడు జైట్లీ మాటలను ఎందుకు స్వాగతించారో.. ఇప్పుడు ఎందుకు యూ టర్న్‌ తీసుకున్నారో చెప్పాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు. హోదా ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉండటం వల్లే రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం ఈ జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంపై ఒత్తిడి తేవడంలో, ప్రత్యేక హోదా సాధన పోరాటంలో తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచీ ఒకే మాట మీద ఉన్నారని బొత్స గుర్తు చేశారు. టీడీపీ కూడా తమతో కలిసి వస్తుందేమోనని.. ఆ అవకాశం ఇవ్వడానికే ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాసం తీసుకొస్తున్నామని బొత్స వివరించారు. ఇప్పటికైనా హోదా పోరులో కలిసి వచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని టీడీపీకి సూచించారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు కాకపోతే రాష్ట్రానికి ఏ విధంగా నష్టం జరుగుతుందో.. దేశ ప్రజలకు చెప్పడమే అవిశ్వాసం అసలు ఉద్దేశమని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నదే తమ పార్టీ తపనగా పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. టీడీపీ ఎన్నికల హామీలను నెరవేర్చే విధంగా లేదన్నారు. ఎన్ని హామీలు ఇచ్చామో.. ఎన్ని నెరవేర్చామో ప్రజలకు చెప్పి ఎన్నికలకు వెళ్లిన ఘనత ఒక్క వైఎస్సార్‌కే దక్కిందన్నారు. 

సత్తాలేదన్న మంత్రి ఎక్కడైనా ఉంటారా?
పోలవరంతో పాటు దుగరాజపట్నం పోర్టు తదితర అంశాలన్నీ రాష్ట్రంతో మాట్లాడే నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ చెబుతున్నారని.. దీనిపై టీడీపీ జవాబు చెప్పాలని బొత్స డిమాండ్‌ చేశారు. వెనుకబడిన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్‌ గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి సాధించిందేంటని నిలదీశారు. వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్‌ ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలోనే పేర్కొంటే.. ఈ హామీ గురించి ఏనాడైనా కేంద్రాన్ని నిలదీశారా అని ప్రశ్నించారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా భోగాపురం ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసేందుకు ఎయిర్‌ ఇండియా అథారిటీ వేసిన టెండర్‌ను రద్దు చేశారని, ఆ సంస్థకు సత్తాలేకపోవడం వల్లే ఇలా చేసినట్టు అశోక్‌ గజపతిరాజు మాట్లాడటం సిగ్గుచేటని బొత్స అన్నారు. ఆయనే.. స్వయంగా తన కింద ఉన్న విభాగానికి సత్తా లేదంటూ కించపరచడం దేశ చరిత్రలోనే ప్రథమమన్నారు.   

మరిన్ని వార్తలు