రాజధాని ఏ ఒక్క సామాజికవర్గానిదో కాదు

26 Aug, 2019 04:49 IST|Sakshi

టీడీపీ ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలేదు

రాజధానికి వరద ముప్పు, నిర్మాణ వ్యయం ఎక్కువేనని నివేదికలే చెప్పాయి

రాజధాని నిర్మాణం ప్రభుత్వ పరిశీలనలో ఉంది

మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాజధాని ఏ ఒక్కరిదో, ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందింది కాదని, ఐదు కోట్ల మంది ప్రజలదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదని, వరదముప్పు ఉందని, పైగా ఎక్కువ ఖర్చుతోకూడుకున్నదని శివరామకృష్ణ కమిటీ తన సిఫార్సుల్లో పేర్కొందని, కానీ వాటిని గత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

రాజధాని నిర్మాణ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని,ఈ అంశంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. రాజధాని ప్రాంతానికి వరద ముంపు ఉందని, ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటికే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని మంత్రి గుర్తు చేశారు. పదకొండు లక్షల క్యూసెక్కుల నీరు వస్తే రాజధాని పరిస్థితి ఏమిటో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. రాజధాని నిర్మాణ వ్యయం ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆ ప్రాంతంలో ఎక్కువవుతుందని పునరుద్ఘాటించారు. రాజధాని విషయంలో పవన్‌ వ్యాఖ్యలు ద్వంద్వ అర్థాన్ని తలపిస్తున్నాయని బొత్స వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు