ఐక్యంగా ‘లోక్‌సభ’కు..

3 Mar, 2019 04:00 IST|Sakshi

కలసి పోటీ చేసేందుకు సీపీఐ, సీపీఎం అంగీకారం

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలసి పోటీ చేసే విషయంపై సీపీఐ, సీపీఎంల మధ్య ప్రాథమిక అంగీకారం కుదిరింది. రాష్ట్రంలో వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్యశక్తులను కలుపుకునిపోయే విషయంలో ఈ పార్టీల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా టీజేఎస్, జనసేన, ఎంసీపీఐ, ఎంబీటీ, బీఎల్‌పీలను కలుపుకుని పోయే అంశంపై తదుపరి చర్చలు జరపాలని నిర్ణయించాయి. శనివారం మఖ్దూంభవన్‌లో జరిగిన ఇరుపార్టీల తొలి సమావేశంలో చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు (సీపీఐ), తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్య, డీజీ నరసింహారావు (సీపీఎం) పాల్గొన్నారు. రాష్ట్రంలో పొత్తులు, ఇతర అంశాలపై జాతీయ నాయకత్వాలను సంప్రదించాక విధివిధానాలు రూపొందించుకుని పోటీ చేసే సీట్లపై చర్చించాలని ఇరుపార్టీలు నిర్ణయించాయి. వచ్చేవారం మరోసారి భేటీ అయి రెండు పార్టీల మధ్య తదుపరి చర్చలు, ఇతర పార్టీల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై ఒక నిర్ణయానికి రావాలని తీర్మానించాయి. 

బీఎల్‌ఎఫ్‌పై సీపీఐ అభ్యంతరాలు...
అసెంబ్లీ ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ ప్రయోగం పేరిట సీపీఎం అనుసరించిన విధానాలపై సీపీఐ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఎల్‌ఎఫ్‌ అంటే మాత్రం సీపీఎంతో కలసి పనిచేసేందుకు సీపీఐ సిద్ధంగా లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో సీపీఐ, సీపీఎం చెరి రెండు సీట్లలో పోటీచేసినా, మిగతా సీట్లలో పోటీపై భావసారూప్య పార్టీలను కలుపుకుపోతే బావుంటుందని సీపీఎం సూచించింది.  

మరిన్ని వార్తలు