స్విమ్మింగ్‌పూల్‌లో మంత్రి.. మండిపడ్డ శివకుమార్‌!

13 Apr, 2020 15:15 IST|Sakshi

బెంగళూరు: మానవాళి మనుగడకు ముప్పుగా మరణించిన కరోనా వైరస్‌(కోవిడ్‌-19)గురించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ప్రజలంతా కరోనా భయంతో విలవిల్లాడుతుంటే స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడటం నైతికంగా దిగజారిపోవడమే అని విరుచుకుపడింది. మంత్రి సుధాకర్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్‌ నేత, ట్రబుల్‌ షూటర్‌.. డికే శివకుమార్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభంలో మునిగిపోయిన వేళ.. రాష్ట్ర కరోనా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. స్విమ్మింగ్‌పూల్‌లో సమయాన్ని గడుపుతున్నారు. నైతిక విలువలకు సంబంధించిన విషయం ఇది. ఆయనే స్వయంగా రాజీనామా సమర్పించాలి. ముఖ్యమంత్రి ఆయనను కేబినెట్‌ నుంచి తొలగించాలి’’అని సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేశారు. (లాక్‌డౌన్‌: రేపు ప్రధాని మోదీ కీలక ప్రకటన)

కాగా వైద్య విద్య మంత్రిగా వ్యవహరిస్తున్న కె. సుధాకర్ ప్రస్తుతం రాష్ట్ర కరోనా వివరాల వెల్లడి ఇన్‌చార్జిగా ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం తన పిల్లలతో స్విమ్మింగ్‌పూల్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోను సోమవారం ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘‘చాలా రోజుల తర్వాత పిల్లలతో కలిసి ఈతకొడుతున్నా. ఇక్కడ కూడా భౌతిక దూరం పాటిస్తున్నాం. హ హ’’అంటూ క్యాప్షన్‌ జతచేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేసిన డీకే శివకుమార్‌ సుధాకర్‌ తీరుపై మండిపడ్డారు. కాగా కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ పార్టీ రెబల్స్‌లో సుధాకర్‌ కూడా ఒకరు. బీజేపీ సర్కారు ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ఆయనను మంత్రిమండలిలోకి తీసుకున్నారు.  కాగా దేశంలో మొదటి కరోనా మరణం కర్ణాటకలో సంభవించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు అక్కడ 232 మంది కి కరోనా సోకగా.. ఆరు మరణాలు నమోదయ్యాయి. (వీడియో షేర్‌ చేసిన ప్రధాని.. నెటిజన్ల ఫైర్‌!)

>
మరిన్ని వార్తలు