చేబదుళ్లు..తడిసి మోపెడు!

14 Oct, 2018 03:03 IST|Sakshi

చెల్లించిన వడ్డీ 124.72

గడువులోగా చెల్లించటంలో విఫలం కావడంతో ఖజానాపై వడ్డీల భారం

గత నాలుగేళ్లుగా అస్తవ్యస్థంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి

పెరిగిపోతున్న అప్పులు.. తరుగుతున్న ఆస్తులు

సాక్షి, అమరావతి: ఆర్థిక అవసరాలతో తెలిసిన వారి దగ్గర చేబదుళ్లు తీసుకోవడం సహజమే. ఇలా చేసిన అప్పును వారం పది రోజుల్లో లేదా వీలైనంత త్వరగా తీర్చేస్తాం. కొద్ది రోజులే కావడంతో ఇలాంటి వాటికి వడ్డీ ఉండదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో చేబదుళ్లకు కూడా రూ. వందల కోట్లలో వడ్డీలు కడుతోంది. గడువులోగా చేబదుళ్లు తిరిగి చెల్లించకపోవడమే దీనికి కారణం.

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే!
రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఆర్థిక సంవత్సరంలో కూడా చేబదుళ్లు చేయడం, అందుకు వడ్డీలు చెల్లించడంలో రికార్డు సృష్టించింది. నాలుగేళ్లలో చేబదుళ్లకు వడ్డీ కింద ఏకంగా రూ.124.72 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 2017–18లో కూడా చేబదుళ్ల జోరు కొనసాగిందని కాగ్‌ స్పష్టం చేసింది. అప్పులు చేసి వాటిని ఆస్తుల కల్పనకు కాకుండా ఇతర అవసరాల కోసం పప్పు బెల్లాలకు వ్యయం చేస్తోంది. దీంతో ఆస్తులు తరిగిపోయి అప్పుల శాతం భారీగా పెరిగిపోతోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో చేబదుళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.45,860.75 కోట్లు తీసుకున్నట్లు ‘కాగ్‌’ నిర్ధారించింది. దీన్ని సకాలంలో చెల్లించకపోవడంతో ఖజానాపై వడ్డీల భారం పడింది. చేబదుళ్లకు వడ్డీలు చెల్లించడం అంటే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఎంత అస్తవ్యస్థంగా ఉందో తేటతెల్లం అవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చేబదుళ్లకు వడ్డీ చెల్లించే పరిస్థితి కల్పించడం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆర్థిక శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

14 రోజుల్లోగా చెల్లిస్తే వడ్డీ ఉండదు..: ఆర్బీఐ అన్ని రాష్ట్రాలకు వేస్‌ అండ్‌ మీన్స్‌ (చేబదుళ్లు) సౌకర్యం కల్పిస్తుంది. ఖజానాలో పైసా లేకపోయినా అత్యవసరాల కోసం వేస్‌ అండ్‌ మీన్స్‌ రూపంలో ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లను వినియోగించుకోవచ్చు. ఈ మొత్తాన్ని సకాలంలో 14 రోజుల్లోగా చెల్లించాలి. 14 రోజుల గడువు దాటితే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. వేస్‌ అండ్‌ మీన్స్‌ పరిమితి దాటితే తరువాత ఓవర్‌ డ్రాప్టుకు వెళ్లాల్సి వస్తుంది. 

బడ్జెట్‌ అంచనాలను మించి రెవెన్యూ, ద్రవ్య లోటు
వరుసగా నాలుగో ఏడాది కూడా చంద్రబాబు సర్కారు అప్పులు చేసి ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ రంగాలకు వ్యయం చేసింది. దీంతో అప్పులు పెరిగిపోతున్నాయి కానీ ఆస్తులు కానరావడం లేదు. ఫలితంగా రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పరాధీనంలోకి వెళ్లిపోతుంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.25,452 కోట్ల మేర అప్పులు చేయగా ఆస్తుల కల్పనకు కేవలం రూ.14,127.03 కోట్లనే వ్యయం చేశారు. అంటే మిగిలిన అప్పును రెవెన్యూ రంగాలకు వ్యయం చేసినట్లైంది. అలాగే బడ్జెట్‌ అంచనాలను మించి రెవెన్యూ, ద్రవ్య లోటు ఏర్పడింది. 2017–18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాల్లో రెవెన్యూ లోటు –415.80 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత రెవెన్యూ లోటు –16,772.83 కోట్ల రూపాయలకు చేరుకుంది. బడ్జెట్‌ అంచనాల్లో ద్రవ్య లోటు –23,054.44 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత ద్రవ్య లోటు –33,591.92 కోట్ల రూపాయలుగా తేలింది. ద్రవ్య, రెవెన్యూ లోటులు ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనలకు మించి ఉండటం గమనార్హం. 

ఆ రికార్డు బాబుదే..
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కూడా ఏడాదిలోని 365 రోజుల్లో అత్యధికంగా 230 రోజులు చేబదుళ్లలోనే గడిపిన చరిత్ర ఉంది. ఆ తొమ్మిదేళ్లలో ఉమ్మడి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఇప్పుడు కూడా మళ్లీ అదే తరహాలో ఆయన పాలన కొనసాగుతోంది. చేబదుళ్లను సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీ చెల్లించే పరిస్థితి కల్పించిన ఘనత దేశంలో ఏ ముఖ్యమంత్రికి దక్కదని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు