వైఎస్సార్‌సీపీ అవిశ్వాసానికి పెరుగుతున్న మద్దతు

17 Mar, 2018 02:14 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి పలు రాజకీయ పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్, తృణమూల్, ఎన్సీపీ, సమాజ్‌వాదీ, ఎంఐఎం తదితర రాజకీయ పార్టీలు వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ముందుకొచ్చాయి. 100 మందికి పైగా ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ.. అవిశ్వాసం విషయంలో వైఎస్సార్‌సీపీ గట్టిగా ఉందన్నారు. ఈ విషయంలో టీడీపీని నమ్మడానికి లేదన్నారు. 

దేశ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌
వైఎస్సార్‌సీపీ ఆందోళనలతో ఏపీకి ప్రత్యేక హోదా అంశం దేశ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌తో పాటు లాబీల్లో కూడా దీనిపై పలు పార్టీల నాయకులు శుక్రవారం చర్చలు సాగించారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఏపీ హక్కు అయిన ప్రత్యేక హోదా కోసం సుమోటోగా మద్దతు తెలుపుతున్నామన్నారు. హోదా ఇచ్చేందుకు నిరాకరించిన బీజేపీ తీరును ఎండగట్టే సమయం ఆసన్నమైందన్నారు.

అలాగే ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్‌ కూడా పోరాడుతోందని చెప్పారు. బీజేపీ వైఫల్యాలను ఎండగట్టడానికి ఇదే సరైన సమయంగా పలు రాజకీయ పార్టీలు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ అవిశ్వాస తీర్మానం చివరకు దేశ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు పలు రాజకీయ పార్టీలు తమతమ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్‌లో ఆందోళన చేస్తుండటంతో శుక్రవారం అవిశ్వాస తీర్మానం చర్చకు రాలేదు. వచ్చే వారం కూడా ఆందోళనను కొనసాగించాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది.  దీంతో వచ్చే వారం కూడా సభ సజావుగా సాగే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందా? అనే దానిపై విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా