మహారాష్ట్ర పరిస్థితికి ఆయనే కారణం: కాంగ్రెస్‌ నేత

26 May, 2020 18:11 IST|Sakshi

ఉద్ధవ్‌ ఠాక్రేపై కాంగ్రెస్‌ నేత విమర్శలు

ముంబై: రాష్ట్రంలో కరోనా సంక్షోభానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నిలకడలేని నిర్ణయాలే కారణమని కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత సంజయ్‌ నిరుపమ్‌ విమర్శించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వాములతో చర్చించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదంటూ అసహనం వ్యక్తం చేశారు. కాగా మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50 వేలు దాటగా... ఇందులో సగానికి పైగా రాజధాని ముంబైలోనే నమోదు కావడంతో ఆందోళనకరంగా పరిణమించింది. పరిస్థితి రోజురోజుకు చేయిదాటి పోతుందే తప్ప అదుపులోకి రావడం లేదు. (క‌రోనా: అత్య‌ధికంగా అక్క‌డే..)

ఈ క్రమంలో మంగళవారం వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ.. తాము మహారాష్ట్ర ప్రభుత్వ మద్దతుదారులం మాత్రమేనని.. పూర్తిస్థాయిలో అధికారంలో లేమంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, పుదుచ్చేరిలో మాత్రమే తమకు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందంటూ మహారాష్ట్ర పరిస్థితులకు తాము కారణం కాదని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై విమర్శలు ఎక్కుపెట్టిన సంజయ్‌ నిరుపమ్‌.. ‘‘ ముఖ్యమంత్రి ప్రజలు, మీడియాతో మాట్లాడతారు. కానీ సంకీర్ణ భాగస్వాములతో చర్చలు జరుపరు. అందుకే 60 రోజుల్లో 60 నిర్ణయాలు. ప్రతీ రోజూ తన నిర్ణయం మార్చుకుంటూనే ఉంటారు. వాటి ఫలితంగానే కరోనా సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది’’ అని మండిపడ్డారు. (కరోనా : రాజకీయ సంక్షోభం తప్పదా..!)

ఇదిలా ఉండగా సంకీర్ణ ప్రభుత్వంలో చెలరేగిన అసంతృప్తిని ఉపయోగించుకుని ప్రతిపక్ష బీజేపీ నేతలు మహా సర్కార్‌ను కూలదోసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత, అధికార భాగస్వామి శరద్‌ పవార్‌ మంగళవారం సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం పవర్‌ మీడియా మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ, సంజయ్‌ నిరుపమ్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.(కరోనా విజృంభిస్తున్నా.. సడలింపులు)

మరిన్ని వార్తలు