యడ్యూరప్ప కచ్చితంగా గెలుస్తారు..!!

18 May, 2018 12:17 IST|Sakshi
ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేశ్‌ రెడ్డి (ఫైల్‌ ఫొటో)

సాక్షి, విజయవాడ : కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో కచ్చితంగా గెలుస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలుపును జీర్ణించుకోలేని కొన్ని శక్తులు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారంటూ ఆయన విమర్శించారు. కన్నడ ప్రజలు బీజేపీ పట్టం కట్టారని... కానీ అక్కడ స్వయంగా సీఎంతో పాటు 16 మంది మంత్రులు ఓడిపోయారని ఎద్దేవా చేశారు.

ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినందున గవర్నర్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరారని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక బద్దశత్రువులైన కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసిపోయి బీజేపీపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. భారతదేశంలో పాకిస్తాన్‌ మాదిరి పరిస్థితులు వస్తాయంటూ వ్యాఖ్యానించడం రాహుల్‌ గాంధీ రాజకీయ అపరికత్వతకు నిదర్శనమని సురేశ్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్‌దేనంటూ ఆయన గుర్తుచేశారు.

బాబు రాజీనామా చేయాలి..
కర్ణాటకలో బీజేపీని ఓడించాలన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్ని కన్నడ ప్రజలు పట్టించుకోలేదని సురేశ్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. కన్నడ ప్రజలు ఇచ్చిన తీర్పును చూసిన తర్వాతైనా చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు ఆ అర్హత లేదు..
సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు కర్ణాటక రాజకీయాలపై మాట్లాడే అర్హత లేదని సురేశ్‌ రెడ్డి మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ, గవర్నర్‌తో కుమ్మక్కై ఎన్టీఆర్‌ను గద్దె దించి, చెప్పులు వేయించారని గుర్తు చేశారు. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ కాళ్ల ముందు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అసలైనది కాదని వ్యాఖ్యానించారు. టీటీడీని చంద్రబాబు సొంత వ్యవహారంలా భావిస్తున్నారని, టీటీడీలో టీడీపీ జోక్యం ఎక్కువైందని ఆయన మండిపడ్డారు. టీటీడీలో అవకతవకలు సరిదిద్దుకోమంటే రమణ దీక్షితులును తొలగించడమేమిటని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు