ఐశ్వర్య ఎంట్రీ.. భర్త రాజీనామా కలకలం!

5 Jul, 2018 12:58 IST|Sakshi

పట్నా : రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ)లో మరోసారి ఆధిపత్య పోరు మొదలైనట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు, ఎమ్మెల్యే తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పార్టీని వీడనున్నట్లు వచ్చిన సోషల్‌ మీడియా పోస్ట్‌ మరోసారి పార్టీలో కలకలం రేపింది. మరోవైపు తేజ్‌ ప్రతాప్‌ భార్య ఐశ్వర్యరాయ్‌ రాజకీయ అరంగేట్రం చేస్తున్న సమయంలో ఇలాంటి వదంతులు ప్రచారం కావడం లాలూ కుటుంబంతో పాటు పార్టీలో ఏం జరుగుతుందోనని ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

అసలేమైందంటే.. ఆర్జేడీ వ్యవస్థాపక దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించాలని పార్టీ భావించింది. ఈ క్రమంలో కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్యుల పేర్లలో లాలూ పెద్ద కుమారుడు తేజ​ప్రతాప్‌ పేరు లేకపోవడం గమనార్హం. తేజ్‌ ప్రతాప్ భార్య ఐశ్వర్యను పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ఆహ్వానించి ఆమెకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ ఫ్లెక్సీల్లో ఆమెకు కీలక స్థానం కల్పించారు. కానీ వ్యవస్థాపక దినోత్సవానికి తనను ఆహ్వానించకుండా అవమానించారని, పార్టీ నుంచి తాను వైదొలగుతున్నట్లు తేజ్‌ ప్రతాప్‌ సోషల్‌ మీడియా ఖాతా నుంచి చేసిన పోస్ట్‌ బుధవారం వైరల్‌గా మారింది.

దీనిపై పట్నాలో జాతీయ మీడియా ఏఎన్‌ఐతో తేజ్‌ ప్రతాప్‌ మాట్లాడుతూ.. కుటుంబ ఒత్తిడి కారణంగా పార్టీనుంచి వైదొలుగుతున్నట్లు (ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా) వచ్చిన ప్రకటనలు అవాస‍్తవాలని చెప్పారు. తన ఫేస్‌బుక్‌ను హ్యాక్‌ చేసి ఎవరో ఇలాంటి పోస్టులు చేసి దుష్ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చుకున్నారు. బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చునని ఆరోపించారు. అయినా పార్టీ ఫ్లెక్సీల్లో తన ఫొటో, పేరు ఉందని.. పార్టీ కార్యక్రమ ఆహ్వానితుల జాబితాలో నేతలందరి పేర్లు చేర్చడం అన్ని సందర్భాల్లో వీలు కాదని తేజ్‌ ప్రతాప్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు