ఆ అదృష్టం నాకే దక్కింది : ఈటల

15 Mar, 2018 09:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలి బడ్జెట్‌ ప్రవేశ పెట్టే అదృష్టం తనకే దక్కిందని, అందుకు చాలా సంతోషంగా ఉందని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తాను నేడు ఐదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నానని చెప్పారు. గురువారం తెలంగాణ శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్‌ ఏవిధంగా ఉండబోతుందనే విషయంపై స్వల్ప వివరణ ఇచ్చారు. అంతా ఐదో బడ్జెట్‌ ఎన్నికల బడ్జెట్‌గా ఉండబోతుందని‌, ఆకర్షణీయంగా ఉంటుందని అనుకుంటున్నారని అవన్నీ ఊహాగానాలేనని ఈటల చెప్పారు. ఎన్నికలకు ముడిపెట్టి బడ్జెట్‌ను అంత చిన్న చూపు చూడొద్దని అన్నారు.

తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తెలంగాణ వెళ్లాల్సిన మార్గం దృష్టిలో పెట్టుకొనో గత బడ్జెట్‌లు ఉన్నాయని, ఇప్పుడు కూడా బడ్జెట్‌ అలాగే ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయం అని, వారి సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుందని అన్నారు. తమ తొలి ప్రాధాన్యత ఎప్పటికీ సంక్షేమమే ఉంటుందని స్పష్టం చేశారు. రెండో ప్రాధాన్యత వ్యవసాయానికి, నీటిపారుదల రంగానికి ఇచ్చామని, తర్వాత విద్యావైద్యరంగం దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ రూపొందించినట్లు చెప్పారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడులకు నిలయంగా హైదరాబాద్‌ మారుతోందని, అందుకు అనుగుణంగా కూడా బడ్జెట్‌లో కేటాయింపులు ఉండబోతున్నాయని ఈటల చెప్పారు.

మరిన్ని వార్తలు