దటీజ్‌ వైఎస్‌ జగన్‌!

22 Jan, 2019 19:20 IST|Sakshi
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో మేడా మల్లిఖార్జున రెడ్డి, తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టడంలో రాజీ పడబోనని రాజన్న తనయుడు మరోసారి నిరూపించారు. కుళ్లు రాజకీయాలు చేయబోమని ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. రాజకీయాల్లో విలువలకు కట్టుబడతామన్న మాటను అక్షరాల పాటించి ఆదర్శంగా నిలుస్తున్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు మడమ తిప్పని పోరాటం చేస్తానని జనం సాక్షిగా ఇచ్చిన మాటకు అనుక్షణం కట్టుబాటు చాటుతున్నారు. ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామమే దీనికి తిరుగులేని రుజువు. (రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరమన్నారు)

వైఎస్సార్‌ సీపీ జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్‌ మేడా మల్లిఖార్జున రెడ్డి మంగళవారం వైఎస్‌ జగన్‌ను కలిశారు. టీడీపీలో ఇమడలేకపోతున్నానని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతానని వైఎస్‌ జగన్‌ను కోరారు. ఎమ్మెల్యే సహా అధికార పదవులన్నింటికీ రాజీనామా చేయాలని ఆయనకు వైఎస్‌ జగన్‌ సూచించారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని చంద్రబాబు విలువలు దిగజార్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత ముఖ్యమని పునరుద్ఘాటించారు.

వైఎస్‌ జగన్‌ సూచనతో పదవులకు రాజీనామా చేసేందుకు మల్లికార్జున రెడ్డి అంగీకరించారు. అధికార పదవులు వదులుకున్న తర్వాతే వైఎస్సార్‌ సీపీలో చేరతానని ప్రకటించారు. వైఎస్‌ జగన్‌ ప్రజాస్వామ్య విలువలు కలిగిన నాయకుడని  ప్రశంసించారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఇదే స్ఫూర్తిని వైఎస్‌ జగన్‌ చాటారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డిని రాజీనామా చేసిన తర్వాత పార్టీలో చేర్చుకున్నారు. వేరొక పార్టీ నుంచి తమ పార్టీలోకి వచ్చే నాయకులు ఆయా పార్టీల కారణంగా వచ్చిన పదవులను వదులుకోవాల్సిందేనంటూ స్పష్టం చేయడం​ ద్వారా రాజకీయాల్లో విలువలకు పెద్దపీట వేశారు వైఎస్‌ జగన్‌. మాటకు కట్టుబడి విలువలు పాటిస్తున్న జననేతకు జనం జేజేలు పలుకుతున్నారు. అభిమానులు ‘దటీజ్‌ వైఎస్‌ జగన్‌’ అంటూ పొంగిపోతున్నారు.

మరిన్ని వార్తలు