‘రాజీనామాలు చేసే దమ్ము టీడీపీకి ఉందా’

22 Jul, 2018 17:22 IST|Sakshi
అనంత వెంకట్రామిరెడ్డి- వై. విశ్వేశ్వరరెడ్డి

సాక్షి, అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసి.. దీక్షలు చేసే దమ్ము టీడీపీ ఎంపీలకు ఉందా అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సవాల్‌ విసిరారు. ఈ నెల 24న చేపట్టనున్న రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు టీడీపీ నటిస్తోందని విమర్శల వర్షం కురిపించారు. రైల్వే జోన్‌ తేలేని దద్దమ్మలు టీడీపీ నేతలని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీ, బీజేపీ రెండు పార్టీలు కారణమన్నారు. కేంద్రానికి ఆ అవకాశం ఇచ్చింది టీడీపీ అని తెలిపారు. చంద్రబాబు ఇప్పుడు కూడా ఎన్డీయే భాగస్వామి, మిత్రుడే అని పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా కోసం వామపక్షాలతో సహా, ప్రజా సంఘాల మద్దతు కోరుతున్నామన్నారు. ఏపీ ప్రయోజనాలను మోదీ వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్టారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్న వేలాది మందిపై కేసులు పెట్టిన ఘనత చంద్రబాబుది అని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై మోదీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. టీడీపీ, బీజేపీ కలిసి ఏపీకి ద్రోహం చేశాయని, వైఎస్సార్‌సీపీ ఎంపీల త్యాగం చారిత్రాత్మకమైనదని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదా ఉద్యమ సారథి వైఎస్‌ జగన్‌
విభజన హామీల అమలు కోసం చేస్తున్న పోరాటాన్ని వైఎస్సార్‌సీపీ ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోందని వైఎస్సార్‌సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రజల మనోభావాలు,  వారికి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్‌లో సుదీర్ఘంగా తమ నేతలు నిరసనలు తెలిపారన్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు పదవికి రాజీనామా చేసి అమరణ దీక్ష చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఏపీ ప్రజల హక్కులను కేంద్రం తిరస్కరించడం దుర్మార్గమని మండిపడ్డారు. తప్పును బీజేపీపైకి నెట్టి చంద్రబాబు జారుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్యాకేజీని చూసి అసెంబ్లీ సాక్షికి చంద్రబాబు, మంత్రులు స్వాగతించారని పేర్కొన్నారు.

ప్యాకేజీ బాగుందని కేంద్ర మంత్రులను చంద్రబాబు సన్మానించారని గుర్తుచేశారు. పార్లమెంట్‌లో ప్రత్యేక హోదాపై స్పందించేలా చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. టీడీపీకి  ఏపీ ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నదని విమర్శించారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా ఈ నెల 24న జరిగే ఏపీ బంద్‌కి వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని విశ్వేశ్వరరెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు