నీచమైన వ్యాఖ్యలు చేయాల్సిన ఖర్మ మాకు లేదు

30 Oct, 2018 13:42 IST|Sakshi
విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు

ఢిల్లీలో వైఎస్సార్‌ సీపీ నాయకులు

సాక్షి, న్యూఢిల్లీ : ‘చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో అడ్డదిడ్డమైన మాటాలు మాట్లాడిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఆయన కుటుంబ సభ్యులే హత్యాయత్నం చేశారని చెప్పిస్తున్నారు. అలిపిరిలో దాడి మావోయిస్టులు చేసింది కాదు.. భువనేశ్వరి చేయించారని ఎవరైనా అంటే ఒప్పకుంటారా? అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయాల్సిన ఖర్మ మాకు లేదు’ అని వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వరప్రసాద్‌, బొత్స సత్యనారాయణలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పక్కా పథకం ప్రకారమే వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు, లోకేశ్‌, హర్షవర్దన్, శివాజీలు భాగస్వాములన్నారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్న ఘటనపై ఏపీ డీజీపీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరంగా ఉన్నాయన్నారు.

‘అలిపిరి ఘటనలో చంద్రబాబు గాయపడితే హుటాహుటిన వైఎస్సార్‌ తిరుపతికి వెళ్లి పరామర్శించారు. చంద్రబాబుపై దాడికి నిరసనగా వైఎస్సార్‌ ధర్నా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్న సంఘటనను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. హత్యాయత్నాన్ని ఖండించిన నేతలను తప్పుబడుతున్నారు. గవర్నర్‌ను కూడా తప్పుబట్టారు. చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. కేసు సంబంధించిన పూర్వాపరాలు తెలుసుకోకుండానే నిందితుల గురించి డీజీపీ చెప్పడం దారుణం. ఏపీ పోలీసు శాఖ ప్రభుత్వానికి కొమ్ముకాస్తుంది. వాస్తవాలు బయటకు రావాలంటే థర్డ పార్టీ విచారణ జరగాల్సిందే’ అని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. 

డీజీపీ ప్రకటన విచారణ నీరుగార్చేలా ఉంది : వైవీ సుబ్బారెడ్డి
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం పాపులారిటీ కోసమే చేశారని డీజీపీ చెప్పడం దారుణమని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. డీపీపీ ప్రకటన విచారణను నీరుగార్చేలా ఉందని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ అప్రమత్తంగా ఉండటం వల్లే ప్రాణపాయం తప్పిందన్నారు. వైఎస్‌ జగన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. ముఖ్యమంత్రి, మంత్రులు బాధ‍్యతారాహిత్యమైన ప్రకటనలు చేశారని విమర్శించారు. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే శ్రీనివాస్‌ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ నేతల అండలేకుంటే క్రిమినల్‌ కేసులున్న శ్రీనివాస్‌కి ఎన్‌వోసీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. క్యాంటీన్‌ యజమాని హర్షవర్దన్‌.. చంద్రబాబు, లోకేశ్‌లకు సన్నిహితుడని ఆరోపించారు. నిజాలు బయటపడాలంటే కేంద్ర సంస్థలతోనే దర్యాప్తు చేయించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఏపీ ప్రభుత్వ విచారణపై నమ్మకం లేదు: మేకపాటి
వైఎస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీడీపీ కుట్ర చేసి హత్యాయత్నానికి పాల్పడిందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. సరైన విచారణ జరిగితేనే నిజాలు బయటకొస్తాయన్నారు. పాత్రధారుడిపైనే కాదు సూత్రధారులపైనా విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. 
 
సీఎం సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు: వరప్రసాద్‌
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని పోలీస్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో స్పష్టమైనా.. సీఎం చంద్రబాబు నాయుడు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత వరప్రసాద్‌ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నాన్ని ప్రభుత్వం, డీజీపీ చిన్నదిగా చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై దాడి జరిగితే వైఎస్సార్‌ హుందాగా వ్యవహరించారని గుర్తుచేశారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర సంస్థలచే విచారణ చేయిస్తే నిజాలు బటయకొస్తాయని వరప్రసాద్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు