రైతు కంట.. మిర్చి మంట

5 Mar, 2019 16:02 IST|Sakshi
తెగుళ్లతో నాసిరకంగా ఉన్న మిరప చేను

పుట్టిముంచిన తెగుళ్లు

తగ్గిన దిగుబడులు, ధరలు 

జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో మిరప సాగు

ఎకరానికి రూ. 50 వేలు నుంచి రూ. 70 వేలు నష్టం

తల్లడిల్లుతున్న రైతన్న

గత ఏడాది పర్వాలేదనిపించిన మిరప ఈ ఏడాది పుట్టిముంచేలా ఉంది. పోయిన సంవత్సరం ధరలు, దిగుబడులు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది మిరపను సాగు చేసేందుకు మరికొంత మంది రైతులు ముందుకొచ్చారు. మిరపలో వచ్చే లాభాలతో అప్పుల బాధ నుంచి గట్టెక్కవచ్చని ఆశించిన అన్నదాతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చేలకు వైరస్‌ సోకిందని వాపోన్నారు. మార్కెట్‌లో లభించే మందులన్నీ వాడినా పరిస్థితి మెరుగుపడలేదని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పెట్టుబడులు పెరిగి, ధరలు దిగజారడంతో సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, కారంచేడు (ప్రకాశం): జిల్లాలో సుమారు 54 వేల హెక్టార్ల (1.35 లక్షల ఎకరాలు)లో మిరప సాగు చేశారు. సాగుకు నీరు లేక పొలాలన్నీ బెట్టకు రావడమే కాకుండా భూమిలో తేమ లేక పంటలకు కొత్తకొత్త తెగుళ్లు సోకాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల రైతులు ఎకారానికి సగటున రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు చెప్తున్నారు. జిల్లాలో మిరప రైతులు పంటలను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో మిరప చేలకు ప్రధానంగా బూడిద తెగులు, పండాకు, కొమ్మ ఎండు తెగుళ్లు ఆశించాయి. వీటి వల్ల దిగుబడులు ఘోరంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకోవడానికి వ్యవసాయాధికారుల సూచనల మేరకు మార్కెట్‌లో ఎన్ని రకాల నివారణ మందులున్నాయో వాటన్నింటినీ పిచికారి చేసామని సాగుదారులు వాపోతున్నారు. సాగునీరు జిల్లాకు సక్రమంగా విడుదల కాకపోవడమే మిరప రైతు నష్టానికి కారణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన సాగు ఖర్చులు:
గత ఏడాదితో పోల్చుకుంటే భూమి కౌలు నుంచి పంట చేతికందే వరకు అయిన సాగులో ఖర్చులు విపరీతంగా పెరిగాయని రైతులు చెప్తున్నారు.

 ఖర్చు వివరాలు

 రూపాయల్లో..

ఎకరం భూమి కౌలుకు

 30 వేలు– 40 వేలు 

విత్తనాలు, దుక్కి

 13–16 వేలు

సేద్యం, వ్యవసాయం

 5–8 వేలు

నీళ్ల మందులు

 30–35 వేలు

కలుపునకు

 18–20 వేలు

అదనపు ఎరువులకు

 10–12 వేలు

నీళ్ల ఖర్చులు, కోతలకు మొత్తం ఎకరానికి

 రూ. 1.5 లక్షకు పైగా ఖర్చు

గణనీయంగా తగ్గిన దిగుబడులు:

గత ఏడాదితో పోల్చుకుంటే మిరపలో దిగుబడులు గణనీయంగా తగ్గాయని రైతులు చెప్తున్నారు. ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్లు దిగుబడి వస్తే అందుకు తగ్గట్లుగానే బస్తా  రూ. 13 వేలు నుంచి రూ. 15 వేల వరకు వచ్చిందని రైతులు చెప్తున్నారు. వీటిలో కూడా సుమారు 20 శాతం వరకు తాలు కాయలే దర్శనమిస్తున్నాయని  వాపోతున్నారు. ఈ ఏడాది ఎకరానికి కేవలం 5 నుంచి 12 బస్తాలకు మించి దిగుబడులు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ ధర కూడా క్వింటా రూ. 8000 మాత్రమే వుంది. అంటే సగటున ఎకరానికి రైతులు  రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు చెప్తున్నారు.

దిగుబడులు, ధరలు పోల్చుకుంటే..

                      గత ఏడాది..               ఈ ఏడాది
సాగు ఖర్చు     రూ. 1.25 లక్షలు..    1.60 లక్షలు
దిగుబడులు    10–15 బస్తాలు..       5–12 బస్తాలు
ధరలు(కింటా)  రూ. 9–11 వేలు..      రూ. 7–8 వేలు 

ఎకరానికి రూ. 50 వేలకు పైగా నష్టం

మిరప రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోవాల్సిందే. సాగుకు సక్రమంగా నీరు విడుదల చేయకపోడంతో తెగుళ్లు సోకాయి. వీటి వల్ల ఎకరానికి గత ఏడాది 15 బస్తాలు దిగుబడి వస్తే ఈ ఏడాది కేవలం 5 బస్తాలు కూడా రాలేదు. గత ఏడాది బస్తా రూ. 11 వేల వరకు ఉంటే ఈ ఏడాది కేవలం రూ. 8 వేలకు మించడం లేదు. సగటున మిరప రైతు ఈ ఏడాది ఎకరానికి రూ. 50 వేలకు పైగా నష్టం వస్తుంది.
– పోతిని వెంకట్రావు, పోతనివారిపాలెం

తెగుళ్లను నివారించలేక పోయాం

ఈ ఏడాది మిరపకు విపరీమైన తెగుళ్లు వచ్చాయి. వీటిలో ప్రధానంగా బూడిద తెగులు, కొమ్మ ఎండు, పండు ఆకు తెగుళ్లు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. కేవలం తెగుళ్ల మందులకే ఎకరానికి రూ. 30 – 35 వేల వరకు ఖర్చు చేశాం. అయినా తెగుళ్ళు నివారించలేకపోయాం. గత ఏడాది కొద్దిగా లాభాలు వస్తే ఈ ఏడాది అప్పటి లాభాలకు వడ్డీలతో కలుపుకొని నష్టపోయాం.
– నక్కా రామకృష్ణ, రైతు కారంచేడు 

కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి

మిరప రైతులు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే కొంత వరకు తెగుళ్లను నివారించుకోవచ్చు. బూడిద తెగుళ్ళకు ఎకరానికి 1 లీటరు నీటిలో 2 గ్రాముల కోపరాక్సిక్లోరైడ్, ఇండెక్స్‌లను పిచికారి చేసుకోవాలి. కొమ్మ ఎండు, పండు ఆకు తెగుళ్లకు అమిస్టర్‌ లేదా, నోటీఓలను తరచుగా 1 లీటరు నీటిలో 2 గ్రాముల చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే కొంత ఉపసమనం ఉంటుంది.
– కే శివనాగప్రసాద్, ఏడీఏ, పర్చూరు

మరిన్ని వార్తలు