అడల్ట్‌ చిత్రాలు మరిన్ని రావాలి

4 May, 2018 08:35 IST|Sakshi
ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు చిత్రంలో ఓ దృశ్యం

తమిళసినిమా: అడల్ట్‌ చిత్రాలు మరిన్ని వచ్చినా తప్పులేదు అని పేర్కొన్నారు వర్ధమాన దర్శకుడు సంతోష్‌ పి.జయకుమార్‌. ఈయన హరహర మహాదేవకీ అనే అడల్ట్‌ డార్క్‌ కామెడీ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా నటించిన ఈ చిత్రం కమర్శియల్‌గా మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని బ్లూఘోస్ట్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌రాజానే తాజాగా ఇదే దర్శక, కథానాయకుడితో రూపొందించిన చిత్రం ఇరుట్టు అరయిల్‌ మురట్టు కుత్తు. ఇదీ అడల్ట్‌ కామెడీ కథా చిత్రమే. ఇందులో గౌతమ్‌ కార్తీక్‌కు జంటగా యాషీక ఆనంద్, వైభవి శాండిల్య, చంద్రిక రవి ముగ్గురు హీరోయిన్లు రొమాన్స్‌ చేశారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ విలేకరులతో బుధవారం ముచ్చటించారు. చిత్రం గురించి దర్శకుడు సంతోష్‌ పి.జయకుమార్‌ మాట్లాడుతూ ఇంతకు ముందు చాలా మంది చాలా బ్యానర్లలో చిత్రాలు చేశారని, అడల్ట్‌ బ్యానర్‌లో ఎందుకు చిత్రం చేయకూడదన్న ఆలోచనతో తెరకెక్కించిన చిత్రమే ఇరుట్టు అరయిల్‌ మురట్టు కుత్తు అని చెప్పారు.

ఇంతకు ముందు 30 శాతం అడల్ట్‌ సన్నివేశాలున్న చిత్రాలు వచ్చాయని, ఇది 100 శాతం అడల్ట్‌ కథా చిత్రం అని చెప్పారు. అందుకే కుటుంబ సమేతంగా తమ చిత్రాన్ని చూడడానికి రావద్దు అని చెబుతున్నామని పేర్కొన్నారు. ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు చిత్రాన్ని ముగ్గురు మహిళా సభ్యురాళ్లు, ఇద్దరు మగ సభ్యులు చూశారని చెప్పారు. చిత్రం చూసిన తరువాత ఎలాంటి సర్టిఫికెట్‌ కావాలని సెన్సార్‌ సభ్యులు అడిగారని, ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినా పర్వాలేదని తాము అన్నామని చెప్పారు. చిత్రంలో పలాన సన్నివేశాలున్నాయిగా వాటిని తొలగిస్తామని అంటే తాము ఓకే చెప్పామన్నారు. ఇంతకు ముందు ఇలాంటి అడల్ట్‌ కథాంశంలో హరహర మహాదేవకీ చిత్రం చేశారు. మళ్లీ అదే బ్యానర్‌లో ఇరుట్టు అరైయిల్‌ మురట్టుకుత్తు తెరకెక్కించారు. మీపై ఈ తరహా ఇమేజ్‌ ముద్ర పడే అవకాశం ఉంటుందన్న భయం లేదా? అన్న ప్రశ్నకు అలాంటి భయం లేదన్నారు. ఎందుకంటే తన తదుపరి చిత్రం గజనీకాంత్‌ మంచి ఎంటర్‌టెయిన్‌మెంట్‌ అంశాలతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు.

తమిళ సినిమాలో అడల్ట్‌ చిత్రాలకు మీరు మార్గం చూపారని భావించవచ్చా? అన్న ప్రశ్నకు నిజం చెప్పాలంటే అలాంటి చిత్రాలు మరిన్ని వచ్చినా తప్పు లేదని అన్నారు. మనం కొన్ని విషయాలను గుట్టుగా ఉంచడం వల్లే సమాజంలో అత్యాచారాల్లాంటి సంఘటనలు జరగుతున్నాయని దర్శకుడు పేర్కొన్నారు. చిత్ర హీరో గౌతమ్‌కార్తీక్‌ మాట్లాడుతూ దర్శకుడు సంతోస్‌ పి.జయకుమార్‌ ఈ చిత్ర కథను జస్టిఫై చేస్తారన్న నమ్మకంతోనే తాను నటించడానికి సమ్మతించానన్నారు. హర హర మహాదేవకీ చిత్రాన్ని చూసిన తన తండ్రి కార్తీక్‌ కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది అని చాలా ఎంజాయ్‌ చేశారని తెలిపారు. ఈ చిత్రాన్ని చూడడానికి ఆసక్తిగా ఉన్నారని అన్నారు. అయితే ఇలాంటి చిత్రాలు తాను మళ్లీ ఇప్పుట్లో చేయనని చెప్పారు. తదుపరి మంచి ప్రేమ కథా చిత్రం, మంచి యాక్షన్‌ చిత్రం చేయాలనుకుంటున్నానని అన్నారు.

మరిన్ని వార్తలు