ప్రపంచకప్‌కు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన

17 Apr, 2019 19:05 IST|Sakshi

లండన్‌: రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌కు కాస్త ఊరట కలిగించే వార్త. తొలిసారి ఇంగ్లండ్‌ జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. పాకిస్తాన్‌, ఐర్లాండ్‌లతో తలపడబోయే ఇంగ్లండ్‌ జట్టులో ఆర్చర్‌కు అవకాశం కల్పించారు. అయితే ప్రపంచకప్‌కు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. వచ్చే నెల 30 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ప్రపంచకప్‌ కోసం ఇంగ్లండ్‌ తమ జట్టును ప్రకటించింది. ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టులో అనూహ్యంగా జోయ్‌ డెన్లీ చోటు దక్కించుకున్నాడు. 

ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌ స్వదేశంలో జరుగుతుండటంతో ఇంగ్లండ్‌ హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే సెలక్టర్లు ప్రకటించిన ప్రపంచకప్‌ జాబితాలో గత కొంతకాలంగా విశేషంగా రాణిస్తున్న పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కి చోటు దక్కలేదు. బార్బడోస్‌కు చెందిన ఆర్చర్‌ ఇంగ్లండ్‌కు వలస వచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్థానికత కారణంగా ఇన్ని రోజులు ఆర్చర్‌ను పక్కకు పెట్టారు. అయితే నిబంధనలను సవరించిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు.. పాకిస్తాన్‌, ఐర్లాండ్‌ సిరీస్‌లకోసం ఆర్చర్‌ను ఎంపిక చేసింది. 

పాకిస్తాన్‌, ఐర్లాండ్‌ సిరీస్‌ల కోసం సెలక్టర్లు తనను ఎంపిక చేయడం పట్ల ఆర్చర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. జాతీయ జట్టుకు ఆడటం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ జట్టులో తాను లేకపోవడం కాస్త బాధ కలిగించిందని.. అయితే ఐర్లాండ్‌, పాక్‌ సిరీస్‌లలో విశేషంగా రాణించి సెలక్టర్ల మెప్పు పొందుతానని ధీమా వ్యక్తం చేశాడు. 

మరిన్ని వార్తలు