ఒత్తిడిని అధిగమించడం కీలకం

24 Jan, 2020 03:41 IST|Sakshi

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వ్యాఖ్య  

ముంబై: పెద్ద టోర్నీల్లో ఆడేటపుడు ఎదురయ్యే ఒత్తిడిని దరిచేరకుండా చూసుకుంటేనే ఫలితాలు సాధించవచ్చని భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అభిప్రాయ పడింది. ఆ్రస్టేలియాలో జరిగే టి20  ప్రపంచకప్‌కు బయల్దేరే ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘మేం గత రెండు ప్రపంచకప్‌లకు దగ్గరయ్యాం. కానీ... ఒత్తిడిని ఎదుర్కోవడంలో విఫలమై చేజార్చుకున్నాం. ఇప్పుడు అలా కానివ్వం. పెద్ద టోర్నీ అనే సంగతి పక్కనబెట్టి మ్యాచ్‌లు ఆడటాన్ని ఆస్వాదిస్తాం. అలా ఒత్తిడి లేకుండా చూసుకుంటాం’ అని అన్నారు. గత టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఓడిన భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్లో ఓడింది.

ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలీ వర్మల పాత్ర కీలకమని చెప్పిన హర్మన్‌... వాళ్లిద్దరు శుభారంభమిస్తే జట్టు గెలుపొందడం సులభమవుతుందని పేర్కొంది. ఆసీస్‌ ఆతిథ్యమిచ్చే పొట్టి కప్‌ వచ్చే నెల 21 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది. అయితే అంతకంటే ముందు భారత్, న్యూజిలాండ్, ఆ్రస్టేలియాలు సన్నాహకంగా ముక్కోణపు టోర్నీని ఆడతాయి. అందుకే భారత్‌ కాస్త ముందుగా అక్కడికి బయల్దేరుతోంది. 30 ఏళ్ల హర్మన్‌ప్రీత్‌ గతేడాది రాణించలేకపోయింది. ఈ ఏడాది మాత్రం తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంటానని చెప్పింది.   

>
మరిన్ని వార్తలు