భారత మహిళల టెన్నిస్‌ జట్టు కొత్త చరిత్ర

8 Mar, 2020 02:12 IST|Sakshi

తొలిసారి ఫెడ్‌ కప్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత

దుబాయ్‌: టెన్నిస్‌ అభిమానులకు భారత మహిళల జట్టు తీపి కబురు అందించింది. ఫెడ్‌ కప్‌ మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తొలిసారి భారత జట్టు వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించింది. శనివారం ముగిసిన ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 టోర్నీలో భారత జట్టు రెండో స్థానంలో నిలిచి ఈ ఘనత సాధించింది. చైనా టాప్‌ ర్యాంక్‌లో నిలిచి భారత్‌తో కలిసి ప్లే ఆఫ్‌ దశకు బెర్త్‌ దక్కించుకుంది. శనివారం ఇండోనేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో రుతుజా 3–6, 6–0, 3–6తో ప్రిస్కా చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో అంకిత రైనా 6–3, 6–3తో అల్దీలా సుత్‌జియాదిపై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్‌ మ్యాచ్‌లో సానియా మీర్జా–అంకిత రైనా ద్వయం 7–6 (7/4), 6–0తో సుత్‌జియాది–నుగ్రోహో జంటను ఓడించి భారత్‌ విజయాన్ని ఖాయం చేసింది. ఆరు జట్లు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో తలపడిన ఈ టోర్నీలో సానియా, రుతుజా, అంకిత, రియా భాటియా, సౌజన్య భవిశెట్టిలతో కూడిన భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఏప్రిల్‌లో జరిగే ప్లే ఆఫ్‌లో లాత్వియా లేదా నెదర్లాండ్స్‌ జట్టుతో భారత్‌ ఆడుతుంది.   

>
మరిన్ని వార్తలు