టోక్యో వాయిదా... మాకూ భారమే: ఐఓసీ

14 Apr, 2020 05:39 IST|Sakshi
ఐఓసీ చీఫ్‌ థామస్‌ బాచ్‌

టోక్యో: ఈ ఏడాది ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడటం వల్ల అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)పై కూడా భారం పడుతుందని ఐఓసీ చీఫ్‌ థామస్‌ బాచ్‌ చెప్పారు. ఓ జర్మన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... వాయిదా వల్ల మాకూ వందల కోట్ల నష్టం (వందల మిలియన్‌ డాలర్లు) వస్తుంది. ఇక మిగతాదంతా జపానే భరించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ‘ఆతిథ్య ఓప్పందం’లో స్పష్టంగా తెలియజేశాం. జపాన్‌ ప్రధాని సమక్షంలోనే ఈ ఒప్పందం జరిగింది. అదనపు భారంలో సింహభాగాన్ని ఆతిథ్య దేశం భరించాల్సిందేనని నియమ నిబంధనల్లో ఉంది.

కొంత నష్టాన్ని ఐఓసీ భరిస్తుంది’ అని అన్నారు. తాజా అంచనాల ప్రకారం 2 నుంచి 6 బిలియన్‌ డాలర్లు (రూ.15 వేల కోట్ల నుంచి రూ.45 వేల కోట్లు) వరకు ఈ భారం ఉంటుంది. అంటే మొత్తం నిర్వహ ణకు అయ్యే వ్యయంలో ఇంచు మించు సగమన్నమాట! ఇప్పటి వరకు జపాన్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న టోక్యో ఈవెంట్‌ కోసం రూ. 92 వేల కోట్లు (12.6 బిలియన్‌ డాలర్లు) ఖర్చు చేసింది. అయితే ఇటీవల టోక్యో ఆర్గనైజింగ్‌ కమిటీ సీఈఓ తోషిరో ముటో వచ్చే ఏడాది కూడా జరిగేది సందేహాస్పదమేనన్నారు. ‘అప్పటికల్లా మహమ్మారి అదుపులోకి వస్తుందని ఎవరైనా చెప్పగలరా’ అని అన్నారు. దీనిపై బాచ్‌ మాట్లాడుతూ స్పష్టమైన జవాబు ఇచ్చే పరిస్థితిలో తాను లేనని... అయితే మరో వాయిదాకు అవకాశమైతే లేదని జపాన్‌ వర్గాలు చెప్పినట్లు వెల్లడించారు.   

>
మరిన్ని వార్తలు