అగ్రస్థానంలో కోనేరు హంపి 

18 May, 2019 00:42 IST|Sakshi

పెంగ్‌షుయ్‌ (చైనా): ప్రపంచ మాస్టర్స్‌ మహిళల చెస్‌ చాంపియన్‌షిప్‌ బ్లిట్జ్‌ ఈవెంట్‌లో తొలి రోజు గేమ్‌లు ముగిశాక ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది. మొత్తం 22 రౌండ్‌లకుగాను తొలి రోజు శుక్రవారం 12 రౌండ్‌లు ముగిశాయి. 16 మంది మేటి క్రీడాకారిణులు పాల్గొంటున్న ఈ టోర్నీలో 12 రౌండ్‌లు పూర్తయ్యాక హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది.

మిగతా మూడు గేముల్లో ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 6.5 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉంది. హారిక మూడు గేముల్లో గెలిచి, ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడిపోయింది. శనివారం మిగతా పది రౌండ్‌ గేమ్‌లు జరుగుతాయి. ఇదే టోర్నీ ర్యాపిడ్‌ విభాగంలో హారిక 14వ ర్యాంక్‌లో, హంపి 15వ ర్యాంక్‌లో నిలిచారు.   . 

మరిన్ని వార్తలు