నంబర్‌ 1 బ్యాటర్‌గా షఫాలీ.. ఐసీసీ స్పెషల్‌ ట్వీట్‌!

4 Mar, 2020 11:18 IST|Sakshi

మెల్‌బోర్న్‌: భారత మహిళా క్రికెటర్‌, యువ సంచలనం షఫాలీ వర్మ కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. మహిళల టీ20 ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో పదహారేళ్ల షఫాలీ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రెండేళ్లుగా నెంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్‌ బ్యాటర్‌  సుజీ బేట్స్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించారు. కాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు సెమీ ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. గ్రూప్‌ ఏలో టాపర్‌గా నిలిచిన భారత్‌... గ్రూప్‌ బీలో రెండో స్థానంలో ఉన్న మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో సెమీస్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ఢీకొట్టనుంది. (జుట్టు కత్తిరించాల్సి వచ్చింది: క్రికెటర్‌ తండ్రి)

ఇక ఈ మెగా టోర్నమెంట్‌ ఆరంభం నుంచి అదరగొడుతున్న షఫాలీ... గురువారం ఇంగ్లండ్‌తో జరుగునున్న సెమీస్‌ మ్యాచ్‌కు ముందే నంబర్‌ వన్‌ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 161 పరుగులు చేసిన.. ఈ యంగ్‌ బ్యాటర్‌ భారత మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తర్వాత టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌కు చేరిన రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచారు. కాగా తాజా టీ20 వరల్డ్‌కప్‌లో మూడు మ్యాచుల్లో 11 బౌండరీలు, 8 సిక్స్‌లతో మొత్తంగా 114 పరుగులు చేసి172.7 స్టైక్‌రేట్‌ను నమోదు చేసిన షఫాలీ.. ఒక టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక స్టైక్‌రేట్‌ను నమోదు చేసిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ షఫాలీ ప్రత్యేక ఇంటర్వ్యూతో కూడిన వీడియోను షేర్‌ చేసింది. ‘‘ క్రికెట్‌ ఆడేందుకు చిన్నతనంలో అబ్బాయిగా నటించిన షఫాలీ వర్మ.. ఇప్పుడు పదహారేళ్ల వయస్సులో టీ20ల్లో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఎదిగింది! తన స్ఫూర్తివంతమైన ప్రయాణం గురించి ప్రత్యేక ఇంటర్వ్యూ’’ అని ట్వీటర్‌లో పేర్కొంది. (సచిన్‌ స్ఫూర్తితో బ్యాట్‌ పట్టి... ఆయన రికార్డునే సవరించిన చిచ్చర పిడుగు)

ఇక మహిళా టీ20 ర్యాంకింగ్స్‌లో బౌలింగ్‌ విభాగంలో ఇంగ్లండ్‌ బౌలర్‌ సోఫీ ఎక్లేస్టోన్‌ టాప్‌లో నిలిచారు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడిన సోఫీ.. మొత్తంగా 8 వికెట్లు తీశారు. కాగా భారత మహిళా బౌలర్లు దీప్తీ శర్మ, రాధా యాదవ్ ర్యాంకులు కోల్పోయి.. వరుసగా ఐదు, ఏడో స్థానాల్లో నిలిచారు. ఇక టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పేరొందిన భారత లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ నాలుగు స్థానాలు ఎగబాకి.. ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు.

>
మరిన్ని వార్తలు